తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 76,406 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,463 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
పోలీస్ గ్రీవెన్స్‌కు 94 అర్జీలు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే అర్జీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల: హైదరాబాద్‌కు చెందిన వైకేబీ మల్లికార్జునరావు అనే భక్తుడు టీటీడీకి రూ.కోటి విరాళమిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సోమవారం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు, విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షల చొప్పున విడివిడిగా విరాళం డీడీలను అందించారు.
24 నుంచి జూనియర్
కళాశాలలకు సెలవులు
తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలకు ఈనెల 24 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జూన్ ఒకటో తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులలో ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


