ప్రైవేటు బస్సు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

● శ్రీరామానుజాచార్యుల అవతార ఉత్సవంలో చిన్నజీయర్‌ స్వామి

తిరుపతి రూరల్‌: పూతలపట్టు–నాయుడుపేట ఆరు వరుసల జాతీయ రహదారిపై తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్‌ హైవేపై వకుళమాత గుడి సమీపంలోని సర్కిల్‌ వద్ద తిరుపతి రూరల్‌ మండలం పుదిపట్ల గ్రామానికి చెందిన యుగంధర్‌ చౌదరి (53), తన హోండా యాక్టివాపై కొత్త చెర్లోపల్లి బైపాస్‌ రోడ్డు నుంచి ప్రయాణిస్తూ వకుళమాత గుడి వైపునకు మలుపు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అతని వెనుకనే చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న భారతి ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సు అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. బస్సు ముందు భాగంలో స్కూటర్‌ చిక్కుకుని కొంత దూరం ఈడ్చుకురావడంతో స్కూటర్‌ నడుపుతున్న యుగంధర్‌ చౌదరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా మృతుని బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

తొట్టంబేడు: శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం పోలీసులు రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. వారికి అందిన రహస్య సమాచారంతో దాడులు చేసి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ఆధ్యాత్మికతతో సమాజంలో మార్పు

తిరుపతి కల్చరల్‌: ఆధ్యాత్మికతతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన మహనీయులు శ్రీరామానుజాచార్యులు అని తిరుమల చిన్నజీయర్‌ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ప్రారంభించిన చిన్నజీయర్‌ స్వామి అనుగ్రహభాషణం చేశారు. భగవంతుడు అందరివాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో జీవించాలనే సందేశాన్ని శ్రీరామానుజాచార్యులు ఇచ్చారన్నారు.ఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత తత్వం భక్తి, జ్ఞానం, సేవ మార్గాలను కలిపి సమాజానికి దిశానిర్దేశం చేసిందన్నారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన పరకాలన్‌ ‘శ్రీరామానుజాచార్యులు– వైభవం అనే అంశంపై ప్రసంగించారు. ఆ తర్వాత తిరుపతికి చెందిన సరస్వతి ప్రసాద్‌ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులకు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement