తిరుపతి సిటీ: రాయలసీమ, నెల్లూరు జిల్లాల కార్మికులకు వైద్యసేవలు అందిస్తున్న వంద పడకల తిరుపతి కార్మిక రాజ్య బీమా (ఈఎస్‌ఐ)ఆస్పత్రికి సోమవారం అత్యాధునిక అంబులెన్స్‌ను విజయవాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ ఎస్‌బీఐ సంస్థ సుమారు రూ.30 లక్షల విలువచేసే అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అందించడం అభినందనీయమన్నారు. అంబులెన్స్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర కార్మిక మంత్రి సుభాష్, కార్మిక శాఖ కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, డైరెక్టర్ ఆంజినేయులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ డాక్టర్ సీహెచ్ జయంతి, వైద్యులు, ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
చిట్వేలి: స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కే సుధాకర్ రాజు (56) సోమవారం మధ్యాహ్నం రాజంపేట నుంచి చిట్వేలికి వస్తూ చెరువుకట్టపై మోటారు బైక్ డివైడర్‌ను ఢీ కొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కానిస్టేబుల్ సుధాకర్ రాజు మృతికి రైల్వేకోడూరు సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వినోద్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే.. నోరు అదుపులో పెట్టుకోవాలి
– చంద్రగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు
పాకాల: అధికారంలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్న వారిని అమర్యాదగా మాట్లాడడం సరి కాదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఆర్ జయదేవనాయుడు హితవు పలికారు. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జయదేవనాయుడుతోపాటు మండల కన్వీనర్ నంగా నరేష్‌రెడ్డి, ఎంపీపీ పి.లోకనాథం తదితరులు మాట్లాడారు. మోహిత్‌రెడ్డిపై పులివర్తి నాని ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఆయన విజ్ఞతకే వదలి వేస్తున్నామన్నారు. మోహిత్‌రెడ్డికి ఉన్న ఆదరణ చూసి ఎన్నికల ముందు పులివర్తి విషం చేత పట్టుకుని ప్రతీ ఇంటికీ వెళ్లి తనను గెలిపించకపోతే విషం తాగి చస్తా! అని ప్రచారం చేయడం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన తనయుడు మోహిత్‌రెడ్డి మండలాన్ని, నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రత్యేకించి కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పార్టీలకతీతంగా ఇంటింటికీ పౌష్టికాహారం, మందులు, నిత్యావసర సరుకులు అందజేశారని, మరి ఆనాడు ఎక్కడ దాక్కున్నావు నానీ? అని నిలదీశారు. ప్రతి పంచాయతీని కోట్లాది రూపాయలతో చెవిరెడ్డి అభివృద్ధి చేశారని ఆ పనుల గురించి వివరించారు. సాక్షాత్తు పులివర్తి నాని సొంత పంచాయతీ ఆదినపల్లెలో కూడా రూ. కోటీ ముప్పై లక్షలతో అభివృద్ధి చేశారని, అధికారంలోకి వచ్చాక బెంచీలు పగల గొట్టడం, శిలాఫలకాలు ధ్వంసం చేయడం కాకుండా పేదలకు మంచి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రహీం, నంగా కపిలేశ్వర్‌రెడ్డి, జయచంద్రరెడ్డి, బాబురెడ్డి, గిరిధర్‌రెడ్డి, అన్నాబాబు, మునిరత్నంరెడ్డి, వనజ, మాధవనాయుడు, అర్జునయ్య, రుకేష్, చంటి, సుధాకర్, యశ్వంత్‌రెడ్డి, బంగారు గోపి, నాని, అశోక్, ఆంథోని, నిత్యానంద, కుమార్ పాల్గొన్నారు.


