తిరుపతి క్రైం : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలు హత్యకు గురైన ఘటన తిరుపతి రూరల్ మండలంలో వెలుగు చూసింది. చెవి కమ్మల కోసమే ఇద్దరు నిందితులు కలిసి వృద్ధురాలిని హతమార్చినట్లు తేలింది. ఈ వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సోమవారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వెల్లడించారు. అవిలాల పంచాయతీ అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న 78 ఏళ్ల వృద్ధురాలు ఎన్.పాపమ్మను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి హత్య చేసి ఆమె చెవులకు ఉన్న సుమారు రూ.60 వేలు విలువైన బంగారు కమ్మలను అపహరించారు. ఆదివారం ఉదయం హత్య ఘటన వెలుగులోకి రావడంతో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తిరుపతి రూరల్ సీఐ కె.మద్దయ్యాచారి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లోకేష్ కుమార్, సిబ్బంది అనుమానితులు జి.శ్రీనివాసులు (40), జి.శోభ (30)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పాపమ్మ ఒంటరిగా ఉండడాన్ని గమనించి కమ్మల కోసం హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. హత్య అనంతరం కమ్మలను రూ.31 వేలుకు పచ్చికాపల్లం గ్రామంలోని ఒక దుకాణంలో కుదువ పెట్టారని, దొంగ వస్తువులు అని తెలిసినా వాటిని తీసుకున్న దుకాణ యజమాని భూపేంద్ర పటేల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. కేవలం 24 గంటల్లో వృద్ధురాలి హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన తిరుపతి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.


