తిరుపతి సిటీ: ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాలు సోమ వారం రాత్రి ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సుమారు 345 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు సమాచారం.
ప్రైవేటు కళాశాలల హవా
జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో జిల్లాలోని ప్రైవేటు కళాశాలల హవా కొనసాగింది. తిరుపతి ఎంఆర్ పల్లిలోని నారాయణ ఐఐటీ అకాడమీ విద్యా ర్థి ఎన్.మహిత్ జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరిలో 21వ ర్యాంక్ సాధించారు. వెల్దుర్థి హర్షిత్ 64, అన్వి వసంత్ 117 ర్యాంకులు సాధించారు. అలాగే ఆ సంస్థ నుంచి వందలోపు రెండు, వెయ్యి లోపు నాలుగు, రెండు వేలలోపు ఆరు, ఐదువేల లోపు పదకొండు ర్యాంకులు, పది వేలలోపు 16 ర్యాంకులు ఒక్క ఓపెన్ కేటగిరీలోనే సాధించడం గర్వకారణమని డీజీఎం కొండలరావు హర్షం వ్యక్తంచేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ చైతన్య విద్యార్థి జాతీయ స్థాయిలో టీవీఎస్ శర్మ ఈడబ్ల్యూసీ కేటగిరీలో 34వ ర్యాంక్ సాధించాడు. వీరితో పాటు శ్రీ చైతన్య విద్యార్థులు వెయ్యిలోపు నాలుగు, రెండు వేల లోపు 8, ఐదు వేల లోపు 15 ర్యాంకులు కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు సుష్మశ్రీ, నాగేంద్ర, ఏజీఎం బీవీ ప్రసాద్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.


