ఆర్‌ఓ ప్లాంట్‌కు ముసుగు తొలగేనా? | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఓ ప్లాంట్‌కు ముసుగు తొలగేనా?

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

– 8లో ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు ● రోజు రోజుకూ పెరుగుతున్న నిమ్మ ధరలు

న్యూస్‌రీల్‌

పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన

ఆర్‌ఓ ప్లాంట్లు

పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

నిధులు లేవంటూ నిర్లక్ష్యం

మరమ్మతులకు నోచుకోని ఆర్‌ఓలు

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
దామినేడులో కోట్ల విలువచేసే భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు.

సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

బాటిల్‌ నీళ్లతో సరిపెట్టుకుంటున్నారు

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు కె.కృష్ణతేజ. పాకాల ఎన్‌వీఎన్‌.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఎనిమిది నెలలుగా ఆ పాఠశాలలో మినరల్‌ వాటర్‌ ప్లాంటు పనిచేయక పోవడంతో ఆ బాలుడు ఇంటి నుంచి నీటిని తెచ్చుకుంటున్నాడు. ఒక బాటిల్‌ నీళ్లు తెచ్చుకోగా అవి సరిపోవడం లేదు. తరువాత నీళ్లు కావాలంటే అక్కడ దొరకవు. ఉపాధ్యాయులు సొంత నిధులతో పంచాయతీ మినరల్‌ వాటర్‌ ప్లాంటు నుంచి నీటిని తీసుకువచ్చి పెట్టినా ఆ నీరు తాగడానికి సరిగా లేదని పిల్లలు తాగడం లేదు.

కొళాయి నీరు తాగాలి

ఈ ఫొటోలో కొళాయి నీళ్లు తాగుతూ కనిపించే విద్యార్థి పేరు తరుణ్‌. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ జెడ్పీ హైస్కూలులో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాలలో మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఒక ఏడాది కాలంగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి బోరు నుంచి వచ్చే నీటిని కొళాయిలో పట్టుకుని తాగుతున్నాడు. నీళ్లు తాగడానికి చిలుము వాసన వస్తున్నప్పటికీ గొంతు తడుపుకోవాలంటే గుక్కెడు నీళ్లు తాగాలని తాగుతున్నట్టు చెబుతున్నాడు. హెచ్‌ ఎం పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోకుండా మూలనపడేశారు.

పీజీఆర్‌ఎస్‌కు

ప్రత్యేక ప్రాధాన్యత

తిరుపతి అర్బన్‌: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలకు ప్రతి అధికారి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ వెల్లడించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోనే కాకుండా మండల, డివిజన్‌ స్థాయిలోను పీజీఆర్‌ఎస్‌ను తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. నామమాత్రంగా కాకుండా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీదారులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. నాలుగు గంటల సమయంలో వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం చూపించాలని వివరించారు. ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీ రాయడం తెలియకపోతే కలెక్టరేట్‌లోనే గ్రీవెన్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులతో అర్జీలను రాయించుకోవాలని వివరించారు. ముఖ్యంగా మొబైల్‌ నెంబర్‌ను అర్జీలో నమోదు చేయాలని చెప్పారు. సమస్య పరిష్కారం కాకుంటే మళ్లీ అర్జీ ఇవ్వాల్సిన పనిలేదని, గతంలో ఇచ్చిన అర్జీకి ఆన్‌లైన్‌ చేసిన తర్వాత ఇచ్చిన స్లిప్‌ను చూపిస్తే సరిపోతుందని తెలియజేశారు.

శ్రీవారి దర్శనానికి

10 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,232 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నిమ్మ @150

సైదాపురం: ఏప్రిల్‌ నెలలో నిమ్మకాయల ధరలు ప్రతి రోజు పెరుగుతుంటాయి. రెండు రోజులుగా రోజురోజుకు ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రూ.150 నుంచి రూ.165 ధర పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన కాయలు ధర రూ.165 వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సైదాపురం మండలంలో విస్తారంగా ఉన్న రైతులు నిమ్మ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రబీ సీజన్‌లో వరి పంటను సాగు చేసే రైతులు తర్వాత నిమ్మ, బొప్పాయి, మినుము, పెసర పంటలపై ఆధారపడుతున్నారు. గత ఏడాదిలోపాటు ఈ ఏడాది కూడా ఏప్రిల్‌, మే నెలల్లో కాయలు దిగుబడి కూడా తోటల్లో ఆశించిన స్థాయిలో ఉన్న కారణంగా ఆర్థికంగా బలపడ్డారు. రెండు రోజులుగా గూడూరు నిమ్మ మార్కెట్‌లో లూజు(50 కేజీల బస్తా)రూ.7,500 నుంచి రూ.8,250 వరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత కలిగిన నిమ్మకాయలకు మరింతఽ ధర లభిస్తోంది. నిమ్మకాయలకు అధిక ధరలు లభిస్తుండడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

శుద్ధ జలం విద్యార్థులకు దూరం

విద్యార్థులకు శుద్ధ జలం.. అందని ఫలంగా మారింది. పాఠశాలల్లోని శుద్ధజల పరికరాలు(ఆర్వో ప్లాంట్లు) రెండేళ్లుగా గోడలకే పరిమితమయ్యాయి. విద్యార్థులు బోరు నీరు లేదా ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్‌నే తాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మినరల్‌ వాటర్‌ అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ సర్కారు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలన పడ్డాయి. మరమ్మతులకు నోచుకోకుండా.. ఎటూ పనికిరాకుండా.. విద్యార్థులు అందుబాటులో లేకుండా పోయాయి. ఆర్వోప్లాంట్ల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.

రైల్వేకోడూరు అర్బన్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు శుద్ధ జలం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో వాటి పర్యవేక్షణ బాగుండి విద్యార్థులకు సురక్షిత మంచినీరు అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి గురించి పట్టించుకోక పోవడంతో అవి చెడిపోయి మూలన పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇదే పరిస్థితి.

తిరుపతి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువు అవుతున్నాయి. నిధులు మంజూరు కాలేదని కనీస సౌకర్యాలు పట్టించుకునే నాథుడు కరువయ్యారు. దీంతో విద్యార్థులు తాగునీటికీ అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంటి నుంచే తెచ్చుకున్న వాటర్‌బాటిళ్ల నీళ్లు అత్యధిక ఉప్ణోగ్రత నేపథ్యంలో గంటలోనే అయిపోతున్నాయి. దీంతో దాహార్తితో విద్యార్థులు తల్లడిల్లుతున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మరమ్మతులో ఉన్న ఆర్వో ప్లాంట్లను బాగు చేయించడానికి పైసా నిధులు ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ తప్పుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి యంత్రాలు(ఆర్వో ప్లాంట్లు)శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థుల తాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

70 శాతం అటకెక్కిన ఆర్వోప్లాంట్లు

జిల్లాలో గత వైఎస్సార్‌ సీపీ పాలనలో 1,138 స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే, అందులో 811 ప్లాంట్లు పనిచేయడం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎస్వీయూలో నిర్వహించిన హెచ్‌ఎం సమావేశంలో ఆర్వో ప్లాంట్ల సంగతి ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. వేసవి సెలవుల్లో మరమ్మతులు చేయిస్తామని విద్యాశాఖాధికారులు నచ్చచెప్పే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్న మంత్రి నారా లోకేష్‌ కనీసం ఆర్వో ప్లాంట్ల మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

చోద్యం చూస్తున్న విద్యాశాఖ

విద్యాశాఖాధికారులు నిధులు లేవంటూ చోద్యం చోస్తు న్నారు. కొత్తగా ఒక్క ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేయకపోగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గాలికి వదిలివేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా పలు పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. ఉదాహరణకు తిరుపతి నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీలో ఒకేచోట అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 550 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నాలుగు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే అందులో రెండు పాడైపోయాయి. ఇప్పటికీ అలానే నడుస్తున్నాయి. మిగిలిన రెండు ప్లాంట్లలో వచ్చే నీరు చాలక నానా ఇక్కట్లు పడుతున్నారు.

తాగునీటికీ ఇబ్బంది

ఇది వరకు మా పాఠశాలలో ఆర్వో వాటర్‌ ప్లాంటు ఉండేది. నీళ్లు చాలా రుచిగా ఉండేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తాగేవాళ్లం. అయితే కొంతకాలంగా అది పనిచేయడం లేదు. దీంతో ఇంట్లో నుంచి వాటర్‌ బాటిల్‌ తెచ్చుకుంటున్నాను. అయితే నీళ్లు మధ్యాహ్న నికే అయిపోతున్నాయి. దీంతో సాయంత్రం వరకు దాహంతో ఇబ్బంది పడుతున్నా. – వి.రమేష్‌, విద్యార్థి, ఆర్‌ఎస్‌ మాడవీధి హైస్కూల్‌, తిరుపతి

దాహం.. దాహం

మా పాఠశాలలో వాటర్‌ ప్లాంటు పాడై చాలా రోజులు కావస్తోంది. దీంతో ఇంట్లో నుంచి నీళ్ల బాటిల్‌ తెచ్చుకున్నప్పటికీ మధ్యాహ్నం భోజన సమయానికి ఖాళీ అయిపోతుంది. ఇక అప్పటి నుంచి దాహంతోనే ఉండాల్సిన పరిస్థితి. పాడైన వాటర్‌ ప్లాంట్‌ను రిపేరు చేయించి మా దాహార్తిని తీర్చాలి.

– కె.సోమశేఖర్‌, విద్యార్థి,ఆర్‌ఎస్‌ మాడవీధి హైస్కూల్‌, తిరుపతి

వరదయ్యపాళెం: మండల కేంద్రమైన వరదయ్యపాళెం హైస్కూల్‌లో విద్యార్థులకు శుద్ధజలం పంపిణీకి గత ప్రభుత్వంలో రూ.4లక్షల వ్యయంతో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో నాడు–నేడు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వరదయ్యపాళెం హైస్కూల్‌లో నూతన ఆర్వో ప్లాంట్‌ మిషనరీ సైతం అలానే వదిలేశారు. దీంతో 900 మంది విద్యార్థులు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు.

మూలన పడేశారు

గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో వాటర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం విద్యాశాఖ వాటిని మరమ్మతులు చేపట్టి వాడుకోవాలన్న ఆలోచన చేయకపోవడంతో విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ యంత్ర సామగ్రి నిరుపయోగంగా మూలన పడేసి ఉన్నారు. వాటిని బాగు చేయించి వాడుకలోకి తీసుకురావాలి.

– సునీల్‌, విద్యార్థిని తండ్రి, ఏర్పేడు ఉన్నత పాఠశాల

ఆర్వో ప్లాంట్‌ ఉపయోగకరం

మా పాప వినయ శ్రీకాళహస్తి జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ మా పిల్లలకు చాలా ఉపయోగకరం. శుద్ధి చేసిన నీటిని తాగడంతో మా పిల్లలు రోగాల బారిన పడకుండా ఉన్నారు. ఇప్పటికీ హైస్కూల్‌లో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ పని చేస్తోంది. ఆ నీళ్లనే మా పాప తాగుతూ ఉంది.

– కె. కిరణ్‌ కుమార్‌, శ్రీకాళహస్తి

సురక్షితమైన నీరు అందించాలి

మా పాఠశాలలో ఆర్వోప్లాంట్లు పనిచేయడంలేదు. దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. తోటి విద్యార్థులు కొందరు ఇంటి నుంచి బాటిళ్లు తెచ్చుకుని నీరు తాగుతున్నారు. కొళాయిలో నీరు అంత శుభ్రంగా ఉండడంలేదు. పాలకులు స్పందించి సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి.

– లక్ష్మినరసింహారావు, విద్యార్థి, వెంకటగిరి

కుళాయినీరే తాగుతున్నాం

మా పాఠశాలలో ఆర్వో ప్లాంటు పనిచేయకపోవడంలో గత చాలా కాలం నుంచి కొళాయినీరే తాగుతున్నాం. మధ్యాహ్నం భోజన సమయంలో తప్పని పరిస్థితిలో గరలం పట్టిన నీరును తాగుతున్నాం.

– మునికుమార్‌, విద్యార్ధి, వెంకటగిరి

గొంతెండుతోంది!

ఆర్‌ఓ ప్లాంట్‌ పని చేయడంలేదు

మా పాఠశాలలో విద్యార్థులకు సురక్షిత మంచినీరు అందించే ఆర్వో ప్లాంట్‌ చాలా రోజుల నుంచి పని చేయడంలేదు. కొళాయిల్లో వచ్చే నీరే తాగుతున్నాం. వాటర్‌ ప్లాంట్‌కు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. అది ఎప్పుడు బాగుపడుతుందో తెలీయడం లేదు. –ఎం వినోద్‌, 8వతరగతి, తల్లెంవారిపల్లి,

జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల,

ఓబులవారిపల్లి మండలం

Advertisement
 
Advertisement
Advertisement