ఏర్పేడు: అంతరిక్ష ఇంజినీరింగ్‌తో దేశంలో ప్రపంచం గర్వించే ఆవిష్కరణల రూపకల్పనే లక్ష్యంగా పని చేస్తామని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ సహకారంతో ‘భారతదేశ అంతరిక్ష కార్మిక శక్తిని నిర్మించడం’ అనే అంశంపై 2 రోజులపాటు జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం ముగిసింది. ఆయన మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో మానవ వనరుల నుండి పరిశోధన, వ్యవస్థాపకతకు భారతదేశానికి సాంకేతిక నిపుణుల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. వ్యూహాత్మక భౌగోళిక స్థానం, పలు రంగాలలో బలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండడం వంటివి, అంతరిక్ష విద్యారంగంలోకి తిరుపతి ఐఐటీ సకాలంలో ప్రవేశించడానికి దోహదపడుతున్నాయని వివరించారు. భవిష్యత్ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే కీలక కేంద్రంగా పనిచేయడానికి తిరుపతి ఐఐటీకి ప్రత్యేకమైన స్థానం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్రాస్, కాన్పూర్, గౌహతి, రూర్కీ, పాలక్కాడ్, ఇండోర్ ఐఐటీలలో ఎనిమిది అకడమిక్ స్కూల్స్, సెంటర్లను స్థాపించి, 3,000 మంది విద్యార్థులకు అంతరిక్ష ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చారని, 2030 నాటికి 10,000 మందికి పైగా పట్టభద్రులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఐఐఎస్‌టీ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.ఎన్.సురేష్ మాట్లాడుతూ భారతదేశ అంతరిక్ష విద్యా రంగంలో ప్రస్తుతం ఉన్న లోపాలను గుర్తించి, ఆచరణాత్మక ఫలితాలపై లోతుగా ఆధారపడిన పాఠ్యప్రణాళిక ఉండాలని కోరారు. మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాహుల్ మెహతా మాట్లాడుతూ భారతదేశం సరైన దిశలో గొప్ప ముందడుగు వేయడానికి తిరుపతి ఐఐటీ అంతరిక్ష ఇంజినీరింగ్ కార్యక్రమం సమయోచితమన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాసీ్త్రయ కార్యదర్శి గణేష్ పిళ్లై మాట్లాడుతూ భారతదేశంలోని ప్రముఖ సంస్థలలో అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో షార్ డైరెక్టర్ పద్మకుమార్, స్కైరూట్ ఏరోస్పేస్ సహ–వ్యవస్థాపకుడు నాగభరత్ డాకా తదితరులు పాల్గొన్నారు.


