కీర్తి పతాక.. అన్షుమాలిక | - | Sakshi
Sakshi News home page

కీర్తి పతాక.. అన్షుమాలిక

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

హెర్మెన్‌బివెల్స్‌ పురస్కారం అందుకున్న తొలి భారతీయ విద్యార్థిగా గుర్తింపు

యూనివర్సిటీ బంగారు ఫలకంపై శాశ్వతంగా అన్షుమాలిక పేరు

తల్లిదండ్రులు ఆర్కేరోజా, ఆర్‌కే సెల్వమణి సమక్షంలో అవార్డు స్వీకరణ

నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అమెరికాలో కీర్తిపతాక ఎగురవేసింది. తన ప్రతిభతో అరుదైన గుర్తింపు పొందింది. అమెరికాలో ‘హెర్మన్‌ బి వెల్స్‌ డిస్టింగ్విష్‌డ్‌ సీనియర్‌’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించింది. అమెరికాలోని బ్లూమింగ్‌ టన్‌ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతోంది. ఈ యూనివర్సిటీ ఐదేళ్లకు ఒక్కసారి ప్రెసిడెంట్‌ హెర్మన్‌ బి వెల్స్‌ గౌరవార్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్‌ బి వెల్స్‌ డిస్టింగ్విష్‌డ్‌ సీనియర్‌’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్‌కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థి అన్షుమాలిక కావడం విశేషం. యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థిగా ఈమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది.

అవార్డులు.. పురస్కారాలు

అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్‌స్టాండింగ్‌ లీడర్‌షిప్‌ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్‌ ఇన్‌ మై హార్ట్‌’ నవలను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఫెస్టివల్‌లో సోషల్‌ ఇంపాక్ట్‌ విభాగంలో ‘గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అవార్డు’ను, అలాగే ‘మౌరిన్‌ బిగ్గర్స్‌ అవార్డు’ను కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement