తిరుపతి తుడా: చెర్లోపల్లిలోని కెన్ బూ కై షిటోరియూ కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా వేదికగా ఆదివారం ఏపీ క్రీడలు, విద్యాభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా మదనపల్లికి చెందిన బి.మురళి, వైస్ ప్రెసిడెంట్లుగా తిరుపతి జిల్లాకు చెందిన పల్లం రత్నాకర్, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన తేజేంద్ర, అన్నమయ్య జిల్లాకు చెందిన సెక్రటరీగా మనోహర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా రమేష్, కృష్ణయ్య, ట్రెజరర్‌గా అనంతపురం జిల్లాకు చెందిన రాహుల్ బాబు ఎంపికయ్యారు. వీరితో పాటు పలు జిల్లాల నుంచి సుమారు ఏడుగురు ఈసీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఏపీలో క్రీడలు, విద్యారంగాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులలో క్రీడలపై ఆసక్తిని పెంచడం, ప్రతిభావంతులైన యువతను ప్రొత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
అవిలాలలో వృద్ధురాలి హత్య!
తిరుపతి రూరల్: అవిలాల గ్రామంలో 80ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు శనివారం రాత్రి దారుణహత్యకు గురైంది. పోలీసుల సమాచారం మేరకు... అవిలాల పంచాయతీ సుబ్బయ్యకాలనీలో నివాసముంటున్న పాపమ్మ(80)కు భర్త ఐదేళ్ల క్రితం చనిపోగా పిల్లలు లేక పోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ ఆధారంగా జీవనం సాగిస్తోంది. ఆ క్రమంలో శనివారం రాత్రి తన ఇంటి ముందు మంచంపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడకు టవల్‌తో ఉరి వేసి చంపేసి మృతురాలి చెవిలోని కమ్మలను తీసుకు వెళ్లినట్టు సమాచారం. ఆదివారం ఉదయం 11.30 గంటలు అవుతున్నా పాపమ్మ మంచంపై నుంచి నిద్ర లేవకపోవడం, ముఖంపై దుప్పటి తీయకుండా ఉండడంతో ఇరుగుపొరుగు వారు అనుమానంగా ఆమె దుప్పటిని తొలగించారు. అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతురాలికి శవ పరీక్ష నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆమె చెవిలో కమ్మల కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని అంచనా వేస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. సీఐ మద్దయ్య ఆచారి తన సిబ్బందిని అప్రమత్తం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.


