ఉద్యోగుల హక్కుల పరిరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల హక్కుల పరిరక్షణే లక్ష్యం

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

● ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

తిరుపతి అర్బన్‌: ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ అన్నారు. గత దశాబ్ద కాలంగా నిలిచిపోయిన తిరుపతి పట్టణ ఎన్జీజీఓ భవన పునర్నిర్మాణానికి తిరుపతిలోని నరసింహ తీర్థం రోడ్డులో ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లా ఎన్జీజీఓ భవన పునర్నిర్మాణానికి రాష్ట్ర అసోసియేషన్‌ తరఫున ఐదు లక్షల విరాళం ప్రకటించారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా వేతన సవరణ కమిటీని ఆలస్యం చేయకుండా వెంటనే నియమించి ఉద్యోగుల వేతనాలను సవరించాలని, డీఏ, సీపీఎస్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో పురోగతి చూపాలని డిమాండ్‌ చేశారు. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు సరెండర్‌ లీవ్‌ బకాయిల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల సొసైటీ ఉద్యోగులకు విరమణ వయసు 62 పెంచే విషయమై, ఉద్యోగులను సీపీఎస్‌లో నుంచి ఓపీఎస్‌లోకి తీసుకొచ్చే అంశం, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే అంశం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌ అంశం, పెన్షనర్లకు ఎడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ పునరుద్ధరించే అంశం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ పెంపు, ప్రభుత్వ పథకాల వర్తింపు తదితర అంశాలలో తమ అసోసియేషన్‌ నిరంతరం తన ప్రయత్నాలు చేస్తుందన్నారు. అనంతరం అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సురేష్‌ బాబు, కార్యదర్శి సురేంద్ర, కోశాధికారి కోటేశ్వరరావు, సహాధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌ రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షుడు బొప్పన లలిత కుమార్‌, జేఏసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement