● అడ్డుకున్న స్థానికులు ● వెనుదిరిగిన మున్సిపల్, పోలీసు అధికారులు
వెంకటగిరి రూరల్: తాము కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బాధితులకు ముందస్తుగా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా మున్సిపల్, పోలీసు అధికారులు పట్టణంలోని 9వ వార్డులోకి ప్రవేశించి ఇళ్లు కూల్చివేతకు ఆదివారం యత్నించారు. ఈ మేరక స్ధానిక తాజా మాజీ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి, రాజారెడ్డితోపాటు స్థానికులు కలసి అధికారులను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు మున్సిపల్, పోలీసులతో స్థానికులకు వాగ్వివాదం జరిగింది. ఈ సందదర్భంగా స్ధానికులు మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు విస్తీర్ణం పేరుతో ఇళ్లు కూల్చివేశారని ఆ సమయంలో కొంతమంది మృతికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కారకులయ్యారని ఆరోపించారు. పదేళ్ల క్రితం స్థలాలను కొనుగోలు చేసి కష్టపడి ఇళ్లు నిర్మించుకుంటే రాజకీయ కుట్రలో భాగంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. పేదోళ్లపై అధికారులు పెత్తనం చెలాయిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇళ్లు కూల్చివేతకు స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో అధికారులు చేసేదేమిలేక వెనుతిరిగి వెళ్లిపోయారు.


