ఎమ్మెల్యే నాని ఉండే బ్యానర్లు కోసేసిన జనసేన నేత | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నాని ఉండే బ్యానర్లు కోసేసిన జనసేన నేత

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

● జనసేన నేత మురళీరెడ్డి బ్యానర్లు కోసేయడంపై విస్మయానికి గురైన టీడీపీ నేతలు ● ఎమ్మెల్యే అక్రమాలు, కబ్జాలతో విసిగిన కూటమి నేతలు ● ఎమ్మెల్యే నానిపై తిరుగుబావుట

● జనసేన నేత మురళీరెడ్డి బ్యానర్లు కోసేయడంపై విస్మయానికి గురైన టీడీపీ నేతలు ● ఎమ్మెల్యే అక్రమాలు, కబ్జాలతో విసిగిన కూటమి నేతలు ● ఎమ్మెల్యే నానిపై తిరుగుబావుట

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే ఆ పార్టీకి ముసలం పుట్టింది. ఇన్నాళ్లు చాపకింద నీరులా సాగిన కోల్డ్‌వార్‌ ఇప్పుడు రోడ్డెక్కింది. గత ఎన్నికల సమయం నుంచి మొన్నటి వరకు చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామానికి చెందిన తపసి మురళీ రెడ్డి జనసేన నాయకుడు. ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు. అయితే ఏమైందో ఏమో కానీ శనివారం ఒక్కసారిగా జనసేన నేత ఎమ్మెల్యే నాని ఉంటే బ్యానర్లను చించేయడం మండల వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గత ఎన్నికల సమయంలో మురళీ రెడ్డి కూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే నాని గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. అయితే కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ నేతలను ఎమ్మెల్యే దూరం పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మురళీరెడ్టిపై కూడా ఎమ్మెల్యే నాని అదే తరహాలో ప్రవర్తించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఎమ్మెల్యే నాని, మురళీ రెడ్డిని హెచ్చరించాడని ఆ పార్టీ నేతలే గుసగులాడుకుంటున్నారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదనే ఆవేదనతో శనివారం సాయంత్రం జనసేన మురళీరెడ్డి కత్తి తీసుకుని, తిరుపతి–చంద్రగిరి రహదారి తొండవాడ కూడలి వద్ద ఎమ్మెల్యే నాని ఫొటోలతో కూడిన పార్టీ బ్యానర్లను కోసేసినట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే నానిపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత

చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై వ్యతిరేకత నియోజకవర్గంలో పెల్లుబుకుతోంది. గత కొన్ని రోజుల కిందట పనపాకం పంచాయతీలోని జనసేన బ్యానర్లను టీడీపీ నేతలు చించివేయడంతో ఆ పార్టీ నేతలు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలే తమ బ్యానర్లను చించేశారంటూ మీడియా సాక్షిగా ఆరోపణలు గుప్పించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దేవర మనోహర్‌ సైతం ఎమ్మెల్యే నాని అక్రమాలు, అవినీతిపై 15 పేజీల ఫిర్యాదును జనసేన చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొండవాడకు చెందిన జనసేన నేత మురళీరెడ్డి బహిరంగంగా కత్తితో బ్యానర్లను చించేసి, ఈ వీడియోను ఆయనే సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో, ఎమ్మెల్యే నానిపై ఉన్న అక్కసు తెలుస్తోంది. అటు బీజేపీ నేతలు సైతం ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, అధికారుల్లో ఎలాంటి గుర్తింపు లేకుండా చేయడంతో కూటమి నేతలు రగిలి పోతున్నారు. ఎమ్మెల్యే నాని ఇసుక, గ్రావెల్‌ దందాలు, భూ కబ్జాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై విసుగెత్తిన కూటమి నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement