వకుళామాత సేవలో పెద్దిరెడ్డి దంపతులు | - | Sakshi
Sakshi News home page

వకుళామాత సేవలో పెద్దిరెడ్డి దంపతులు

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

తిరుపతి రూరల్‌: మండలంలోని పాతకాలువలో ఉన్న వకుళామాత అమ్మవారిని శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పాలిసెట్‌ హాల్‌ టికెట్లు విడుదల

తిరుపతి సిటీ: పాలిసెట్‌–2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సాంకేతిక విద్యామండలి శుక్రవారం నుంచి హాల్‌ టికెట్లను విడుదల చేసిందని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, ప్రాంతీయ పాలీసెట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ వై ద్వారకనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు https:/polycettap.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా లేదా మనమిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ పంపి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. తిరుపతి రీజియన్‌లో 10 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 25వ తేదీ శనివారం పాలిసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో శ్రీకాళహిస్తి, తిరుపతి, రేణిగుంట పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి అర్బన్‌: భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతర కార్మికులకు సంక్షేమ పథకాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శనివారం కలెక్టరేట్‌ నుంచి సమాచారశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా వివాహ కానుక పథకం(ఇద్దరు ఆడ పిల్లలకు) రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజన పథకం రూ.20 వేలు(రెండు కాన్పులకు), సహజ మరణం సాయం పథకం కింద రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చుల పథకానికి రూ.20 వేలు చొప్పున అందిస్తారని వెల్లడించారు. ఆ ప్రకారం అన్ని విభాగాలకు చెందిన కార్మికులు 2026 మార్చి ఒకటో తేదీ తర్వాత నుంచి వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకాలకు దరఖాస్తులను మీ సమీపంలోని అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో అందజేయవచ్చని స్పష్టం చేశారు.

మే 21 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

తిరుపతి సిటీ: ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సువర్ణావకాశాన్ని కల్పించింది. మే 21వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌లోనూ సబ్జెక్టులు తప్పిన విద్యార్థులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన వారు ఇంప్రూమెంట్‌ రాసుకునే అవకాశం కల్పించింది. ప్రతి పేపర్‌లో విద్యార్థులు సాధించిన మార్కుల్లో ఉత్తమ మార్కులు పరిగణలోనికి తీసుకోనున్నారు. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు ఇంప్రూమెంట్‌ కోసం పరీక్ష ఫీజు రూ.600తో పాటు ప్రతి పాసైన సబ్జెక్టుకు రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్‌, ఫస్ట్‌ ఇయర్‌ రెండింటీకి కలిపి పరీక్ష ఫీజు రూ.1200తో పాటు ప్రతి ఇంప్రూమెంట్‌ సబ్జెక్టుకు రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. మే నెల 21వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.

స్విమ్స్‌లో సంక్లిష్టమైన చికిత్స విజయవంతం

తిరుపతి తుడా: స్విమ్స్‌ ఆస్పత్రిలో సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన మధ్య వయస్సు మహిళ తలనొప్పి, కుడి కంట్లో చూపు మందగించడంతోపాటు కుడి కంటి రెప్ప వాలిపోవడంతో స్విమ్స్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారని తెలిపారు. టీటీడీ ప్రాణదానం పథకం కింద ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ఉందని వైద్యులు నిర్థారించారని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆమెకు రెండు వారాల పాటు అత్యంత ఖరీదైన మాత్రలు అందించి, క్లిష్టమైన, ఖరీదైన చికిత్సను విజయవంతగా అందించామని తెలిపారు. ఈ సందర్భంగా రోగి మాట్లాడుతూ రూ. 5 లక్షలకు పైగా ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని ఉచితంగా అందించిన టీటీడీ యాజమాన్యానికి, స్విమ్స్‌ వైద్యులకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement