తిరుపతి అర్బన్: ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్. వెంకటముని మండిపడ్డారు. దశల వారీగా నిరనసలు, ధర్నాలు చేస్తున్నా ఉపాధ్యాయుల వైపు సర్కార్ చూడడం లేదని పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద శనివారం ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మధ్యంతరభృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి, ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలని వెల్లడించారు. నాలుగు విడతల్లో ఉన్న పెండింగ్ డీఏలను ఇవ్వాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి బి. మురళీకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తగ్గించాలని, బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీలకు హెచ్‌ఎంల ఉద్యోగోన్నతులు కల్పించాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో ఉపాధ్యాయుడిని తప్పకుండా నియమించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రతం అందజేశారు. ఉపాధ్యాయులకు ఏపీ జేఏసీ చైర్మన్ సురేష్‌బాబు, సీనియర్ కామ్రేడ్ సుధాకర్, ఏపీ ఎన్జీవో సెక్రటరీ సుబ్రమణ్యం మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ చెంచురాజు, రాజేష్ ఆనంద్, భువనేశ్వరి, వాసుకి,ఆర్ గోపాల్, జానా హరి ,శ్రీనివాసులు, హేమ కుమార్, రామదాసు, మదన్‌మోహన్, పీడీ చంద్రశేఖర్, ఎల్లయ్య ,ఖైరుద్దీన్, రాజేంద్రన్ ,మంజుష, హేమ కుమార్, రమణయ్య.శ్రీనివాసులు పాల్గొన్నారు.


