తిరుపతి క్రైం: పోలీసులు ప్రజాసేవల్లో నాణ్యత పెంచాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. న్యాయ సంబంధిత అంశాలు, ఈ–సాక్షి, మీ సేవ, పీజీఆర్‌ఎస్, సిటిజన్ 112, సీసీ కెమెరాల వినియోగం తదితర కీలక అంశాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్షించారు. ఆధునిక సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి నేర నియంత్రణలో ముందుండాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలనరు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంతో స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తును వేగవంతం చేసి, సాక్ష్యాధారాలను సమయానికి సేకరించి చార్జ్‌షీట్లు దాఖలు చేయడంలో ఆలస్యం చేయరాదని ఆదేశించారు. పాత కేసులు పేరుకుపోకుండా ప్రతి కేసును నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


