కేవీబీపురం: ఉపాధి హామీ పథకం కింద హౌసింగ్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉపాధి సిబ్బందిని డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ సస్పెండ్ చేశారు. 2024–2025 సంవత్సరానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణ ఎంపీడీఓ మాలతి ఆధ్వర్యంలో శనివారం కేవీబీపురం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. కళత్తూరు, కండ్లూరు, కేవీబీపురంలో హౌసింగ్ నిర్మాణంలో ప్రభుత్వ నిధులు లబ్ధిదారులకు చేరకుండానే, నిధులను పక్కదారి పట్టించిన విషయం ప్రజావేదికలో బట్టబయలు కావడంతో ఏపీఓ కుమారస్వామి, జేఈ చెంగల్ రాయులు, టీఏ వెంకటయ్యను సస్పెండ్ చేశారు. 831 పనులకు గాను రూ. 1.40 కోట్ల వరకు ఉపాధి హామీలో ఖర్చుపెట్టినట్లు నివేదికలు చూపిస్తున్నప్పటికీ తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించి రూ.1.50 లక్షల రికవరీకి పీడీ శ్రీనివాస ప్రసాద్ ఆదేశించారు. సస్పెండ్‌కు గురైన ఏపీఓ కుమారస్వామి ఒక దశలో అధికారులపై చిందులు వేశారు. ఒక్కసారిగా 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక తొలగించారని, ఆరే మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఢిల్లీ బాబు, పీడీ శ్రీనివాస ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా పనిచేసినప్పటికీ అకారణంగా తప్పులు లేనప్పటికీ 22 మందిని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఢిల్లీ బాబు తన ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కాడు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మునస్వామి యాదవ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి గోపీనాథ్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు థామస్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బాబు యాదవ్, ఏపీడీ సరిత, ఎస్‌ఆర్‌పీ లోకేష్, ఏవీఓ గణేష్, ఏపీఓ భాస్కరయ్య పాల్గొన్నారు.


