తిరుపతి అన్నమయ్యసర్కిల్: చిల్లకూరు మండలం పోటుపాళెం రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి రూ.45.82 కోట్ల అంచనాతో ఆమోదం లభించినట్లు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి వెల్లడించారు. ఇందులోనే పాదచారుల రహదారిని సురక్షితంగా దాటేందుకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని, పనులు ప్రారంభమైన తర్వాత సుమారు 15 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భూ సేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని, సంబంధిత జాతీయ రహదారుల శాఖాధికారుల నుంచి సమాచారం అందినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై చిల్లకూరు క్రాస్ రోడ్ (పోటుపాళెం రోడ్డు) వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై తొలిసారిగా 14 జూన్ 2022న కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ ద్వారా తెలియజేసినట్లు గుర్తు చేశారు. ఆ లేఖలో కృష్ణపట్నం పోర్టు ట్రాఫిక్, జాతీయ రహదారిపై రాకపోకల కారణంగా చిల్లకూరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆ లేఖలో వివరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం లేదా రహదారి పునర్నిర్మాణం అత్యవసరమని కోరామన్నారు. అనంతరం పలు పర్యాయాలు ఆయనతో బేటీ అయినప్పుడు ఈ అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు 2025 ఫిబ్రవరి 6న లోక్‌సభలో ప్రశ్న సంఖ్య 498 రూపంలో లేవనెత్తినట్లు గుర్తు చేశారు. చిల్లకూరు క్రాస్ రోడ్ వద్ద వాహనదారులు, పాదచారుల కోసం వంతెన (వీయూపీ/ఎఫ్‌ఓబీ) నిర్మాణంపై ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించిందా, వాటిని ఆమోదిస్తుందా, పూర్తి చేసే కాలపరిమితి ఎంత అనే అంశాల గురించి ప్రశ్నించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర జాతీయ రహదారుల శాఖా మంత్రి నుంచి స్పష్టత వచ్చిందని వివరించారు.


