శ్రీసిటీ (వరదయ్యపాళెం):తెలుగుసంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఏటా శ్రీసిటీలో నిర్వహించే ఉగాది పురస్కారాల కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీసిటీ శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేతుల మీదుగా ప్రముఖ పద్య నాటక కళాకారులు డాక్టర్ మీగడ రామలింగస్వామి, హరికథా భాగవతార్ డాక్టర్ ముప్పవరపు సింహాచలశాస్త్రి, ఆధ్యాత్మికవేత్త కందాడై సెల్వన్, జానపద కవి గాయకులు పోల్లూరు జగన్నాథం పురస్కారాలను అందుకున్నారు. పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సన్నారెడ్డి, ప్రముఖులను సత్కరించడం సంతోషకరమని అన్నారు. శ్రీసి టీ, మంచి నివాసయోగ్య ప్రాంతంగా రూపుదిద్దుకునే క్రమంలో కళలను ప్రోత్సహిస్తూ శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


