తిరుపతి తుడా: స్మార్ట్ సిటీలో ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీలైన వైజాగ్, కాకినాడ తరహాలో తిరుపతిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి ట్రాఫిక్, శానిటేషన్, ఎమర్జెన్సీ వంటి సేవలకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఒక చోట నుంచే నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే వాటిని ఆపరేట్ చేయడానికి వీలుంటుందని చెప్పారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 360 డిగ్రీల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 120 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తిరుపతి నగర ప్రజలకే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘన, ఎమర్జెన్సీ, మున్సిపల్ సేవలు, వాహనాల చోరీలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు గుర్తించడం వంటి వాటి కోసం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంత ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన కెమెరాలతో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్రైమ్ మేనేజ్‌మెంట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి పోలీస్ లేకున్నా ఆన్‌లైన్ ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని కోరారు.


