డక్కిలి: దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ నిర్వాసితుల సమస్యకు ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి చొరవతో శుక్రవారం ఒ కొలిక్కి వచ్చింది. డక్కిలి మండల ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు 45 రోజుల్లో ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తామని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆల్తూరుపాడులో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా చర్చించారు. ఆల్తూరుపాడు, వెల్లంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 80 మంది రైతులు గత నాలుగు దశాబ్దాలుగా సుమారు 180 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే రిజర్వాయిర్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో వారు జీవనధారం కోల్పోయారు. ఫారెస్టు భూములు సాగు చేసినందున నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని, గతంలో అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. దీనిపై గతంలో రెండు దఫాలుగా జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. రైతులు నష్టపరిహారం కోసం పట్టుబడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. అర్హులైన ప్రతి రైతుకూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో చోట సాగుకు అనువైన భూమలు కేటాయిస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ హామీపై రైతులు సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారు. భూములు గుర్తింపు, అర్హుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేస్తామని భానుప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఎన్నోఎళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


