రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఈ నెల 27 నుంచి మే 3 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడూ సంతృప్తిగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేలా ఆలయాధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. రాపూరు మండలం పెంచలకోనలో శుక్రవారం అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆర్డీఓ అనూషతో కలసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పెంచలకోనకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. హనుమంత సేవ ,గరుడసేవ, కల్యాణం రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ అందించాలని ఆదేశించారు. ఆ మూడు రోజులు టైం స్లాట్ విఽధిస్తామని, విఐపీలు ముందుగా ఆలయాఽధికారులకు తెలపాలన్నారు. విఐపీలకు ఉదయం 8 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. పెంచలకోన బ్రహోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటుంటామన్నారు. ఆర్డీఓ అనూషా మాట్లాడుతూ బ్రహోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం పెంచలకోన బ్రహోత్సవాల పోస్టర్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల, ఆర్డీఓ అనూషా ఆవిష్కరించారు.


