టీటీడీ జూనియర్ కళాశాలల పేద విద్యార్థుల పరిస్థితి దయనీయం ఇంటర్ పుస్తకాలకు నోచుకోని విద్యార్థులు పట్టించుకోని టీటీడీ ప్రభుత్వ కళాశాలలలో మిగిలిన పుస్తకాలే వారికి గతి
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువులకు గంట మోగింది. విద్యార్థులతో టీటీడీ కళాశాలలు కళకళలాడుతున్నాయి. కానీ విద్యార్థుల చేతులే వెలవెలబోతున్నాయి. పాఠ్యపుస్తకాల్లేకుండా..ఉత్తి చేతులతోనే వస్తున్నారు. ఎన్నో ఆశలు..ఆకాంక్షలతో టీటీడీ విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఉచిత విద్య, వసతి కల్పిస్తున్న తిరుమల, తిరుపతి దేవస్థానం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడంలో విఫలమవుతోంది. ఫలితంగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇక్కట్ల పాలవుతున్నారు.
తిరుపతి సిటీ: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ఏకై క నగరం తిరుపతి మాత్రమే. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీ డఫ్ అండ్ డమ్ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ కళాశాలలనే విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలుగా భావించి ప్రవేశాలు పొందుతున్నారు. నగరంలో ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ప్రభుత్వం ఏటా ఇంటర్ విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాల కిట్‌కు టీటీడీ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సైతం ఉచిత పుస్తకాల కిట్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అధికారులకు విన్నవిస్తున్నారు. కానీ టీటీడీ యాజమాన్యం, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
మిగిలిన పుస్తకాలే దిక్కు
జిల్లాలోని 72 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించిన తర్వాత మిగిలిన పుస్తకాలను మాత్రమే టీటీడీ విద్యాసంస్థలకు అధికారులు అందిస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులకు ఏటా టీటీడీ జూనియర్ కళాశాలలకు చెందిన అధికారులు తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని రిక్వెస్ట్ లెటర్లు పంపుతున్నారు. దీంతో మిగిలిన పుస్తకాలను జిల్లా అధికారులు టీటీడీ కళాశాలలకు చేరవేస్తున్నారు. టీటీడీ యాజమాన్యం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయడంలో విఫలమవడంతో ఏమీ చేయలేని స్థితిలో పేద విద్యార్థుల తల్లిదండ్రులు సొంత నిధులతో అప్పులు చేసి మార్కెట్‌లో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.
టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థగా పేరొందిన టీటీడీ తన ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నప్పటికీ కేవలం పుస్తకాలు అందించడంలో విఫలమైంది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కోర్సుల్లో సుమారు 5 వేల మంది వరకు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 75 శాతం రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే చదువుతున్నారు. ఈ ఏడాది కేవలం విద్యారంగ అభివృద్ధికి రూ.180 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ మెరుగైన విద్యకోసం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ పేద విద్యార్థులకు పుస్తకాల కిట్‌ను అందించడంలో విఫలం కావడం దారుణమని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు.
ఎస్వీ జూనియర్ కళాశాల
అక్కడ మిగిలితేనే... ఇక్కడ పుస్తకాలు!
శ్రీపద్మావతి జూనియర్ కళాశాల
అందుబాటులో ఉన్న గ్రూప్‌లు – 5
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు
860
సెకండ్ ఇయర్ విద్యార్థులు
860
ఎస్వీ జూనియర్ కళాశాల
అందుబాటులో ఉన్న గ్రూప్‌లు – 5
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు
550
సెకండ్ ఇయర్ విద్యార్థులు
550
ఎస్వీ డెఫ్ అండ్ డమ్ జూనియర్ కళాశాల
అందుబాటులో ఉన్న గ్రూప్‌లు – 2
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు
88
సెకండ్ ఇయర్ విద్యార్థులు
88


