చంద్రగిరికి రౌడీ సంస్కృతి తేవద్దు..! | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరికి రౌడీ సంస్కృతి తేవద్దు..!

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

● ఇక్కడి ప్రజలు ఆధ్యాత్మికతను ఎక్కువగా కోరుకుంటారు ● ఎమ్మెల్యే మాటలు, ప్రవర్తన హుందాగా ఉండాలి ● మీడియా సమావేశంలో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గానికి రౌడీ సంస్కృతిని తీసుకు రావద్దని వైఎస్సార్‌ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానికి సూచించారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నాని మాటలు హద్దులు దాటాయని, గతంలో తమ ఆస్తులు కాపాడుకునేందుకు లాలూచీ రాజకీయాలకు పాల్పడిన వారు, ఇప్పుడు నీతి, నిజాయతీ గురించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నాని మాటలు నమ్మి మంత్రి నారా లోకేష్‌ అవాస్తవాలు, అసత్యాలను తన తండ్రికి ఆపాదించి వ్యక్తిగతంగా మాట్లాడడంతోనే తాను ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తాను హుందాతనంతో మాట్లాడినప్పటికీ ఎమ్మెల్యే నాని ‘‘పిల్లబచ్చా, అరేయ్‌.. ఒరేయ్‌.. తాటతీస్తా.. ఉచ్చ పోయిస్తా.. ఒక్కొక్కరికీ బడిత పూజ చేయిస్తా’’ వంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. రౌడీయిజం, దౌర్జన్యాలు, అసభ్య పద జాలం మాట్లాడే ఏ వ్యక్తిని చంద్రగిరి ప్రజలు అంగీకరించరని, అలా వ్యవహరించే వాళ్లని సరైన సమయంలో గట్టిగా సమాధానం చెబుతారని హెచ్చరించారు.

దాడులు ఆపేందుకు నాడు చెవిరెడ్డికి ఫోన్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పులివర్తి నాని తన క్వారీల్లో జరిగే విజిలెన్స్‌ దాడులను ఆపేందుకు ఆయన బంధువు ఆర్‌టీవీ ప్రసాద్‌ ద్వారా కాన్ఫరెన్స్‌తో తన తండ్రి చెవిరెడ్డికి ఫోన్‌ చేయించారని మోహిత్‌ రెడ్డి తెలిపారు. చంద్రగిరి మండలానికి చెందిన నాని బంధువు గిరినాయుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాకాల మండలం మద్దినాయునిపల్లి వద్ద 10 ఎకరాలు కొత్త క్వారీని కూడా మంజూరు చేయించుకున్నారని చెప్పారు. ఐదేళ్ల వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూనే నాని అన్ని పనులు చేసుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.

వంద మంది కార్యకర్తలను కొట్టించారు

చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పులివర్తి నాని వైఎస్సార్‌ సీపీకి చెందిన వంద మంది కార్యకర్తలను కొట్టించారని, వారి ఆస్తులు, వాహనాలు ధ్వంసం చేయించారని, ఇళ్లకు నిప్పు పెట్టి ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టించారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడించారు. అయితే జగనన్న ప్రభుత్వంలో 2023 చివరి వరకు నానితో పాటు వారి కుటుంబ సభ్యులపై ఒక కేసు కూడా పెట్టించలేదనడానికి 2024 ఎన్నికల్లో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ ఒక్కటే ఆధారమన్నారు.

చెవిరెడ్డిని ప్రలోభ పెట్టిన మాట వాస్తవం

తిరుపతి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన తన తండ్రి చెవిరెడ్డిని 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడించి వారి పార్టీ లోకి తీసుకెళ్లడానికి అప్పటి మంత్రి డాక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పుత్తూరు ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారన్నారు. ఆ ప్రలోభాలపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి, అప్పటి సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ప్రకంపనలు సృష్టించాయన్నారు.

ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధం

తుడాలో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా? అన్న విషయం చంద్రగిరి ప్రజలకు తెలుసునన్నారు. అధికారం ఉందని లిక్కర్‌ అక్రమ కేసులో జైలుకు పంపినట్టు తుడాలో కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి తనతో పాటు తన తండ్రి చెవిరెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నామని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement