సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘పాతికేళ్ల కిందటే చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు 27 ఏళ్లకే తిరుపతి జెడ్పీటీసీగా గెలిచిన చెవిరెడ్డిని టీడీపీలోకి వస్తే రెండు కోట్లు డబ్బు..జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు..రూ.20 కోట్లు ఇచ్చినా సరే వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటానని చెవిరెడ్డి తిరస్కరించారు.. ఆ వాస్తవాన్ని ఇప్పుడున్న సీనియర్ తెలుగుదేశం నాయకులను అడిగితే చెబుతారు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చెవిరెడ్డి ఏమాత్రం లొంగని వ్యక్తిత్వాన్ని 2001 సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ప్రస్తావించారు.. ఆ మాటలు అసెంబ్లీ రికార్డుల్లో పదిలమై ఉంటాయి.. అదీ చెవిరెడ్డికి వైఎస్సార్ కుటుంబంతో ఉన్న లాయల్టీ.’’ అని మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఖండించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూతురినిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అతని పా ర్టీని, పదవిని లాక్కుంటే, నారా లోకేష్ కుటుంబ సభ్యు ల సహకారంతో చంద్రబాబును టార్చర్ పెట్టి ఆయన పదవిని, పార్టీని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ నాయకత్వంపైన చంద్రబాబుకే కాదు ఆ పార్టీలో ఎవరికీ నమ్మకం లేదన్నారు. తన పదవి ఎప్పుడు లాక్కుంటారోనన్న ఆందోళనతో చంద్రబాబు అనారోగ్యం పాలవుతున్నట్టున్నారని ఆరోపించారు. టీడీపీలో కార్యదర్శిగా కూడా సరిపోని నారా లోకేష్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పదవిని బలవంతంగా లాక్కున్నట్టు ఆ పార్టీలో ఉన్న సీనియర్లు చెబుతున్నారన్నారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
చంద్రబాబు విద్యార్థిగా ఉన్నపుడే తన తాత సుబ్రమణ్యంరెడ్డి ఆ విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఉన్నారని, ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అవినీతి గురించి నారా లోకేష్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. చంద్రగిరి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే నారా లోకేష్ సొంత ఊరు నారావారిపల్లికి వెళ్లాలని, ఆ గ్రామాన్ని చెవిరెడ్డి రూ.2 కోట్లతో అభివృద్ధి చేసేంత వరకు వాళ్లు ఏమీ చేయలేదన్న వాస్తవాన్ని గ్రామస్తుల్లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. భగవంతుడు అంటే వారికి భయం, భక్తి రెండూ లేవు కనుకనే దేవుడు లడ్డూ, వస్త్రాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి లిక్కర్ స్కామ్‌లో రూ.600 కోట్లు సంపాదించారని నారా లోకేష్ చేసిన అసత్యపు ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణం చేయగలరా? అని మోహిత్‌రెడ్డి ప్రశ్నిచారు. నారా లోకేష్ చేసిన ఆరోపణలు అబద్ధాలు, అసత్యాలని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం, నిజాయతీ తమకు ఉందన్నారు.
చంద్రగిరిని వదిలి ఎందుకు పారిపోయారు ?
చంద్రగిరితో తమ కుటుంబానికి సెంటిమెంట్ ఉందన్న నారా లోకేష్ మాటలపై స్పందించిన మోహిత్‌రెడ్డి నిజంగా అంత సెంటిమెంట్ ఉంటే చంద్రబాబు చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి ఎందుకు వెళ్లారని, నారా లోకేష్ మంగళగిరికి ఎందుకు పారి పోయారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా సమయం మించిపోలేదని, చంద్రగిరితో సెంటిమెంట్ ఉందంటున్న నారా లోకేష్ అక్కడెక్కడో ఎందుకు పోటీ చేయడం, ఇక్కడ నుంచే పోటీ చేయచ్చుకదా..? ఆ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో జరిగితే నారా లోకేష్‌పై అఖండ మెజారిటీతో గెలుస్తానని, అలా గెలవని పక్షంలో తనతో పాటు తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. నారా లోకేష్ చంద్రగిరిలో ఓడిపోతే వాళ్ల నాన్నతో పాటు ఆయన కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు.


