మనోవేదనతో వైఎస్సార్‌సీపీ నేత మృతి | - | Sakshi
Sakshi News home page

మనోవేదనతో వైఎస్సార్‌సీపీ నేత మృతి

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

● అధికార పార్టీ నేతల అక్రమ కేసులతో తీవ్ర మనస్తాపం

ఏర్పేడు : మండలంలోని పల్లం గొల్లపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు అక్కుపల్లి వెంకట్రామయ్య (70) తన కుటుంబంపై అధికార పార్టీ నాయకులు కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి, జైలుపాలు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురై గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. పల్లం గొల్లపల్లికి చెందిన అక్కుపల్లి వెంకట్రామయ్య మనుమడు నవీన్‌ను అధికార పార్టీ నాయకులు ఓ గొడవలో ఇరికించి కేసు పెట్టారు. దీంతో నవీన్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నెలరోజుల పాటు తన మనుమడు జైలులో ఉండడంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకట్రామయ్య ఆరోగ్యం క్షీణించింది. మూడ్రోజుల కిందట నవీన్‌ బెయిల్‌పై రావడంతో మనువడిని హత్తుకుని భోరున విలపించాడు. గురువారం ఉదయం అకస్మాత్తుగా మరణించాడు.

నా కార్యకర్తల జోలికొచ్చిన వారిని విడిచిపెట్టను

నా కార్యకర్తల జోలికొచ్చిన వారిని విడిచి పెట్టనని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. ఏర్పేడు మండలంలోని పల్లం గొల్లపల్లికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు వెంకట్రామయ్య(70) మృత్యువాత పడిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే తెలుసుకున్నారు. దీంతో ఆయన పల్లంగొల్లపల్లికి చేరుకుని, వెంకట్రామయ్య మృతదేహానికి పూలమాల వేసి, నివాళుర్పించారు. మృతుని కుటుంబసభ్యులతో కలసి పాడె మోశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు వాపోయారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్‌, ఏర్పేడు సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ కూకటి జనార్దన్‌యాదవ్‌, వెంకటేశ్వరరావు, గంగయ్యయాదవ్‌, భానుమూర్తియాదవ్‌, నవీన్‌, కన్నయ్య, మునెయ్య, జల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement