● జిల్లాలో నిరాశపరచిన ఇంటర్మీడియట్ ఫలితాలు ● రాష్ట్ర స్థాయిలో 8, 11 స్థానాలతో సరిపెట్టుకున్న తిరుపతి జిల్లా ● మే 21 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ● సప్లిమెంటరీ, రీవెరిఫికేషన్‌కు ఈనెల 20 నుంచి 27వరకు గడువు
ఒకింత ఉత్సాహం..
తిరుపతి సిటీ: రాష్ట్రంలో బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తిరుపతి జిల్లా నిరాశపరిచింది. ఎలాగైనా జిల్లాను తొలి ఐదు స్థానాలకు చేర్చాలని ప్రత్యేక తరగతులు, ప్రణాళికలు అమలు చేసినా జిల్లా యంత్రాంగానికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. శాశ్వత అధ్యాపకుల కొరత, నూతన సిలబస్, సరికొత్త ప్రశ్నపత్రం, ప్రధాన సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని ప్రత్యేకంగా గుర్తించడంలో విఫలం కావడమే ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు రావడం కాస్త ఊరట నిచ్చినా, సెకండ్ ఇయర్ ఫలితాలు గత ఏడాది కంటే దిగజారిపోవడంపై ఇటు అధికారులు, అటు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దిగజారిన ద్వితీయ ఫలితం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 80 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 27,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 22,344 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 86 శాతంతో 8వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది ఏకంగా 3 స్థానాలు దిగజారి 11వ స్థానం దక్కించుకుంది. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 28,383 మంది పరీక్షలు రాయగా 22,016 మంది ఉత్తీర్ణులయ్యా రు. గత ఏడాది 71 శాతంతో 9వ స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా ఈ ఏడాది 78 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానానికి చేరుకోవడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ కోర్సుల్లో 56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల హవా మాత్రం యఽథావిధిగా కొనసాగగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో మాత్రం ఫస్ట్ ఇయర్ 54 శాతం, సెకండ్ ఇయర్ 68 శాతం ఫలితాలు నమోదయ్యాయి. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి జూనియర్ కళాశాలలో 95 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఎస్వీ జూనియర్ కళాశాలలో 85 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఆ సబ్జెక్టులే కొంపముంచాయా!
నూతన సిలబస్‌తో తొలిసారి ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ చాలా తికమకపెట్టినట్లు తెలుస్తోంది. అందులో 8 మార్కుల ప్రశ్నలు చాలా వరకు ప్రాబ్లమెటిక్ ఇవ్వడంతో ఆ సబ్జెక్టులో విద్యార్థులు అధిక సంఖ్యలో తప్పినట్లు సమాచారం. అలాగే కెమిస్ట్రీ పేపర్ సైతం మోడల్ పేపర్‌లో ప్రస్థావించిన ప్రశ్నల సరళికి కాస్తా తేడాగా ప్రశ్నలు సందించడంతో ఆ సబ్జెక్టులోనూ విద్యార్థులు వెనుకబడ్డారు. నూతన సీబీఎస్‌ఈ సిలబస్ స్థాయిలో నాణ్యమైన బోధన అందించే అధ్యాపకులు పలు కళాశాలలో లేకపోవడం ఒక కారణంగా తల్లిదండ్రులు, విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం మంది ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో తప్పినట్లు తెలుస్తోంది.
మే 21 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ పరీక్షలు తప్పిన విద్యార్థుల కోసం, తక్కువ మార్కుల వచ్చి ఇంప్రూమెంట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అలాగే ఆసక్తిగల విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు ఈనెల 20 నుంచి 27వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఆయా కళాశాల ద్వారా ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు విద్యార్థులు చెల్లిచాల్సి ఉంటుందన్నారు.
జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇంటర్ ఫలితాల సరళి
సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
(శాతంలో) (శాతంలో)
2023–24 70 81
2024–25 71 86
2025–26 78 80
జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన కళాశాలల వివరాలు
కళాశాలల సంఖ్య హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
ఏపీఆర్‌జేసీ 1 107 100 93.46
ఎయిడెడ్ 1 336 155 46.13
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ 10 629 512 81.40
ఏపీటీడబ్ల్యూఆర్ 3 239 195 81.59
బీసీ రెసిడెన్షియల్ 2 209 178 85.17
ప్రభుత్వ కళాశాలలు 21 1677 765 45,62
హైస్కూల్ ప్లస్ 23 601 229 38.10
కేజీబీవీ 4 151 101 66.89
ఏపీఎమ్‌ఎస్ 5 365 250 68.49
ప్రైవేట్ కళాశాలలు 105 24,703 19,531 79.06
ఫస్ట్ ఇయర్‌లో మెరుగైన ఫలితాలు సాధించాం
ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులు వచ్చాయనో విద్యార్థులు అధైర్య పడాల్సిన పనిలేదు. మే 21 నుంచి జరిగే ఇంటర్ అడ్వాన్స్‌డ్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం కాస్త శ్రమిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కాస్త వెనుకబడినా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు గత ఏడాది కంటే మెరుగైన స్థానం దక్కింది. వచ్చే ఏడాది టాప్ 5లో జిల్లాను నిలిపేందుకు సమష్టి కృషి చేస్తాం.
– జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి


