పదవులు పందేరంలో తమ్ముళందరికీ షాక్
మొదటి నుంచి జెండా మోసినా
పట్టించుకోని అధిష్టానం
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్రస్థాయి పదవులను ప్రకటించిన టీడీపీ
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 మందికి చోటు కల్పించిన అధిష్టానం
ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారికీ కీలక పదవులు
ఎంత కష్టపడినా ప్రయోజనం లేదని టీడీపీ సీనియర్లు ఆగ్రహం
అయినా వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో చందంగా నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు.. ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికి ఒట్టి చేతులు చూపారని పచ్చనేతలు మండిపడుతున్నారు. తమని కరివేపాకు చందంగా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పదవుల పందేరంలో చంద్రబాబు కుఠిల రాజకీయం ప్రదర్శించారని వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధిష్టానం ప్రకటించిన పదవుల పందేరంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర దుమారం రేగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసిన వారికి కాకుండా నిన్న, మొన్న పార్టీలోకి జంప్ అయిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పటైన సుమారు రెండేళ్ల తరువాత టీడీపీ అధిష్టానం బుధవారం పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీలను ప్రకటించింది. ఈ జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ విజయకుమార్ (తిరుపతి), ఎన్ అమర్నాథ్‌రెడ్డి (పలమనేరు), జీ నరసింహయాదవ్ (తిరుపతి), చిట్టిబాబు (జీడీ నెల్లూరు), రవినాయుడు (తిరుపతి), అన్నా అనిత (తిరుపతి), పురిమిట్ల కుమారి (తిరుపతి), జి. దశరథాచారి (శ్రీకాళహస్తి), ఎం సుబ్బయ్య (శ్రీకాళహస్తి), పి చందన స్రవంతి (సత్యవేడు), లక్ష్మీప్రసన్న (నగరి), ఆర్ మీరా నేతాజీ (నగరి), కర్జాల అరుణ (జీడీ నెల్లూరు)కి పదవులు లభించాయి. ఇందులో నలుగురు, ఐదుగురు మాత్రమే సీనియర్ నాయకులు ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారు కూడా ఉండడంతో మొదటి నుంచి జెండా మోసిన సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదవులు ఉన్న వారికి ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి అనేక మందిలో ఉంది.
ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తింపు
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్నత పదవులు లభించని అనేక మంది నాయకులను అధిష్టానం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకుని వదిలేస్తుందనే ప్రచారం ఉంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ప్రస్తుతం పదవుల పందేరంలో తమకు చోటు దక్కకపోవడంతో తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్య నేతలు వచ్చి భుజాన చేయివేసి క్షేమ సమాచారాలు గురించి అడగడంతో గాల్లో తేలిపోయి పనిచేశామని చర్చించుకుంటున్నారు. ఓట్ల రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని సీనియర్ నాయకులు కొందరు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓట్ల కోసమే..
పదవుల కోసం కాదు
అందరికీ అన్యాయమే..
తిరుపతి బీసీ సామాజిక వర్గంలో యాదవులకు తప్ప మరొకరికి పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. అది కూడా ఒకరిద్దరికి మాత్రమే. మిగిలిన మెజారిటీ సబ్ క్యాస్ట్‌లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రమణ్యం కమిటీల్లో పదవులు కోల్పోయారు. వీళ్లంతా సీనియర్లు..రాష్ట్ర పదవులు వస్తాయని ఆశించిన దంపూరి భాస్కర్ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, పులుగోరు మురళి, పుష్పలతను కరివేపాకులా వాడుకుంటున్నారని వారి అనుచరులు మండిపడుతున్నారు. సూళ్లూరుపేటకు చెందిన తిరుమూరు సుధాకర్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, శంకరయ్యయాదవ్ సీనియర్లు అయినా పార్టీలో గుర్తింపు లభించలేదు. చంద్రగిరి పరిదిలో సీఎం చంద్రబాబు పేరు పెట్టి పిలిచే నాయకులు అనేక మంది ఉన్నా.. ఒక్కరికి కూడా చోటు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో కూడా సీనియర్ నాయకులున్నా వారెవరికీ చోటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, దొరబాబు, చంద్రప్రకాష్, సుభాష్ చంద్రబోస్, చిట్టిబాబు నాయుడు, విజయబాబు, జయప్రకాష్ నాయుడు, గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పానికి చెందిన ఆంజనేయరెడ్డి, దేయరాజులు నాయుడు జెండా మోయటానికే పరిమితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.


