శ్రీహరి అక్రమ అరెస్టు దారుణం | - | Sakshi
Sakshi News home page

శ్రీహరి అక్రమ అరెస్టు దారుణం

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు దారుణమని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేయడంతో డైవర్షన్‌ రాజకీయాలు చేసేందుకు శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇటువంటి హేయమైన చర్యలను ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు.

అరెస్టు దుర్మార్గం

తిరుపతి రూరల్‌: సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని తుడా మాజీ చైర్మన్‌, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్‌మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు, సలహాదారుడు, గత ప్రభుత్వంలో సీపీఆర్‌ఓగా పనిచేసిన ఆయనపై ప్రభుత్వం కక్షకట్టిందన్నారు. సోషల్‌ మీడియాలో ఎవరు ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు ప్రభుత్వం జైలుకు పంపుతోందని, న్యాయస్థానాలు మందలించినా ప్రభుత్వం, పోలీసుల తీరు మారడం లేదని నిరసించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రతి పోలీసు అధికారి భవిష్యత్తులో ఇంతకు రెండింతలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,426 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,889 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement