ఘొల్లుమంటున్న పల్లెలు..! | - | Sakshi
Sakshi News home page

ఘొల్లుమంటున్న పల్లెలు..!

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

కూటమి రెండేళ్ల పాలనలో కళతప్పిన పంచాయతీలు రాజకీయ కుట్రలకు బలవుతున్న గ్రామాలు ప్రాధాన్యత కోల్పోయిన సచివాలయాలు కనుమరుగైన వలంటీర్లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. సమస్యలు పేరుకుపోయాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కూటమి నేతలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. ప్రకృతి వనరులను స్వాహా చేస్తున్నారు. రాజకీయ దాడులు పెరిగాయి. విచ్ఛలవిడిగా బెల్టుషాపుల నిర్వహణలో మద్యం ఏరులై పారుతోంది. ఇన్ని తెలిసినా పాలకులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కార్వేటినగరం: ఐదేళ్ల కిందట పల్లెల్లో విప్లవం మొదలైంది. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందాయి. ఊరు అంటే గుడి, బడి, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ అన్న నానుడి వచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందాయి. ముఖ్యంగా కరోనా కాలంలో వలంటీర్లు చేసిన సేవలు ఘనమైనవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు. రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పి గ్రామ వలంటీర్లను నిలువునా మోసం చేశారు. ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పడుతున్నాయి. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పాఠఽశాలల్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. పింఛన్లు తప్ప మరే లబ్ధి లేకుండా జనం అవస్థలు పడుతున్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించాల్సి ఉండగా తమ అనుచరులకు మాత్రమే అందుతున్నాయి. గత ఐదేళ్లలో కనిపించని బెల్టు షాపులు ఊరు ఉసురు తీస్తున్నాయి.

రాజకీయ కుట్రలు పేట్రేగిపోయి హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెలు నువురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. ఈ రెండేళ్లలో 90 శాతం దాడులు, దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అనంతరం వివిధ కారణాలతో వైఎస్సార్‌ సీపీ అనుబంధ సంఘాల సభ్యులపై భౌతిక దాడులు చేశారు.

కళ తప్పిన సచివాలయాలు

రూరల్‌ గవర్నెన్స్‌ ద్వారా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలనే ధ్యేయంతో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం పంచాయతీలు 697 ఉండగా 822 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 612 గ్రామ, వార్డు సచివాలయలను ఏర్పాటు చేశారు. 4477 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించారు. సుమారు 516 సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిచివాలయాలు కళ తప్పాయి. వైఎస్‌ జగన్‌పై ఉన్న కక్షతో సచివాలయాల్లో ఉచిత సేవలకు మంగళం పాడారు. ప్రజలు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరిట బయటకు పంపేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలదీ అదే పరిస్థితి. రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు అందడంలేదు. ఇక వైద్యం సంగతి సరేసరి.

జిల్లాలోని జనాభా 18.73 లక్షలు

జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822

గ్రామ పంచాయతీలు 697

గ్రామ వార్డు సచివాలయాలు 612

సచివాలయాల ఉద్యోగులు 4477 మంది

ప్రస్తుతమున్న ఉద్యోగులు 4040 మంది

డిప్యుటేషన్‌పై వెళ్లిన వారు 437 మంది

జిల్లా సమాచారం

Advertisement
 
Advertisement
Advertisement