కలువాయి(సైదాపురం): టిప్పర్ ఢీ కొని 32 గొర్రెలు మృతి చెందిన ఘటన కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన రెండ్ల చిన్న పుల్లయ్య, ఆలి సుధాకర్, మనుబోటి చిన్నయ్యకు చెందిన 37 గొర్రెలను పెనబద్వేల్‌లో మేతకు తీసుకెళ్లి అక్కడ నుంచి పపలపాడు గ్రామానికి తీసుకుని వెళుతుండగా బుధవారం తెల్లవారుజామున వెంకటరెడ్డిపల్లి జాతీయరహదారిపై టిప్పర్ వేగంగా వచ్చి గొర్రెల మందను ఢీకొనడంతో 32 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందగా 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెలను ఢీకొన్న టిప్పర్ ఆపకుండా వెళ్లి కుల్లూరు గ్రామంలో టిప్పర్‌ను దాచగా గొర్రెల యజమానులు టిప్పర్‌ను కనుగొని కలువాయి పోలీసులకు సమాచారం అందజేశారు.
మహిళలకు మెరుగైన
అవకాశాలు కల్పించాలి
తిరుపతి రూరల్: దేశ రాజకీయాల్లో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించాలని, దీనికి మహి ళా రిజర్వేషన్ బిల్లు ఒక సోపానంగా చేసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ అన్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023పై శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో మహిళా అధ్యయన విభాగం బుధవారం చర్చావేదిక నిర్వహించింది. సాధినేని మాట్లాడు తూ, ఆర్థిక అసమానతలను నిరోధించి ఇంటిని, వ్యాపారాలను చక్కదిద్దే మహిళలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకమవడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘నారీ శక్తి వందన్ అధినీయం’ మహిళాభ్యున్నతికి దోహద పడుతుందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష మాట్లాడుతూ, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల భాగస్వామ్యం పెరగడం ద్వారా రాజకీయ సాధికారత సాధ్యం అవుతుందన్నారు. లీడింగ్ అడ్వకేట్ కేసీ.సరళ మాట్లాడుతూ, మహిళా నాయకురాళ్లు ధైర్యంగా, స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే ఆ బిల్లు లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. మహిళా అధ్యయన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.పద్మావతి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ‘నారీశక్తి వందన్..’ఆశయానికి కట్టుబడి ఉన్నామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ చర్చావేదికకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ వి.వాణి సమన్వయకర్తగా వ్యవహరించారు.


