నాగలాపురం: టీటీడీ అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని జేఈఓ వీరభద్రం అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. బ్రహ్మోత్సవాలు సమయంలో మాడ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి చల్లటి తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విద్యుత్ విభాగంలో సమస్యలు తలెత్తకుండా సీఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గరుడ వాహనం, రథోత్సవ సేవలను భక్తులు వీక్షించేందుకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా హెచ్‌డీ క్వాలిటీ ప్రసారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, పీఆర్వో రవి, ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్‌రాయులు, ఉదయ్‌కుమార్, పాల్గొన్నారు.


