తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఎర్రావారిపాళెం మండలం కే తిప్పిరెడ్డి గారిపల్లికి చెందిన వి.హరినాథరెడ్డికి ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, ఎర్రావారిపాళెం సీఐ లోకేష్, కోర్టు కానిస్టేబుల్ శివ కథనం మేరకు.. 2016 సెప్టెంబర్ 30వ తేదీ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎర్రావారిపాళెం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఎర్రావారిపాళెం మండలం, మర్రిపాటివారిపల్లి, గానుగచింత రోడ్డు, గాజులేరు వద్ద తనిఖీలు చేపట్టారు. నిందితుడు హరినాథరెడ్డితోపాటు మరో ఇద్దరు కలిసి వాహనంలో 63 కిలోల బరువున్న 5 ఎర్రచందనం దుంగలను ఆక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. హరినాథరెడ్డిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.


