లోకేష్‌.. హామీలు హుష్‌! | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. హామీలు హుష్‌!

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

అటకెక్కిన ఏటా 4లక్షల ఉద్యోగాలు

భ్రాంతిగా నిరుద్యోగ భృతి

ప్రహసనంగా జాబ్‌ క్యాలెండర్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసే లేదు

మూలపడిన స్కిల్‌ హబ్‌లు

మండిపడుతున్న విద్యార్థి సంఘాలు

మాటలు చెప్పడం సులభం.. నిలబెట్టుకోవడమే కష్టం. హామీలు గుప్పించడం సులువే.. కానీ అమలు చేసేందుకు చిత్తశుద్ధి అవసరం. గతంలో యువగళం పేరుతో నారా లోకేష్‌ పాదయాత్ర చేశారు. భారీగా భరోసాలు ఇచ్చి యువతను మాయ చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రలోభపెట్టారు. స్కిల్స్‌ పెంచి ఉపాధి అవకాశాలను ముంగిటకు తీసుకువస్తామని బీరాలు పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్నింటినీ గాలికి వదిలేశారు. ఈక్రమంలోనే చినబాబు గారడీలపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మోసపూరిత వైఖరిపై రగిలిపోతున్నారు.

బకాయిలతో పాటు చెల్లించాలి

యువగళంలో లోకేష్‌ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చెల్లించాలి. రెండేళ్లుగా ఒక్కో నిరుద్యోగికి ఎలాంటి బకాయిలు లేకుండా మొత్తం ఇవ్వాలి. ఏడాదికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు ప్రామిస్‌ చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.

– రవి యాదవ్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ ఎస్వీయూ అధ్యక్షుడు

హామీలన్నీ గాలికే..

ఎన్నికల హామీలలో భాగంగా లోకేష్‌ ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించారు. ఒక్కటీ అమలు చేయలేదు. చివరకు జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారు. యువతను పూర్తిగా వంచించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. – అక్బర్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి

తిరుపతి సిటీ : యువతకు ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచి జనవరి ఒకటో తారీఖునే జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3వేల భృతి అందిస్తాం. పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి యువతకు ఉపాధి కల్పించి తీరుతాం అంటూ నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా హామీలు అమలు చేయకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన మాట దేవుడెరుగు ఉన్నవాటిని తొలగించి చిరుద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నారు.

గాలం వేసి.. నామం పెట్టేశారు!

యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్‌ ఊరు వాడా తిరుగుతూ యువతతో ముఖాముఖి పేరుతో సభలు నిర్వహించి గాలం వేశారు. అధికారం చేపట్టి విద్యాశాఖమంత్రిగా తనకు మాత్రమే ఉపాధి కల్పించుకుని నిరుద్యోగులకు శఠగోపం పెట్టేశారు. రెండేళ్లుగా యువతను వంచిస్తూనే ఉన్నారు.

హామీలు ఇవి.. నెరవేర్చిన తీరు

నిరుద్యోగ భృతి ఊసేలేదు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేతులెత్తేసేశారు

జాబ్‌ క్యాలెండర్‌ తూతూ మంత్రం

ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు అంతా మాయ

స్కిల్‌డెవలప్‌మెంట్‌ హబ్స్‌ మూలన పడేశారు

యువతకు హామీలేని రుణాలు ఊసే లేదు

యువగళం మాటలు..

నీటి మూటలు

Advertisement
 
Advertisement
Advertisement