తిరుపతి కల్చరల్ : సామాజిక న్యాయం, సమానత్వమే అంబేడ్కర్ ఆశయమని, ఆ మహనీయుని సేవలు మరువలేమని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్‌టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాలకు సమన్యాయం చేయాలనే ఆకాంక్షతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అయితే ప్రస్తుం రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎస్సీలను భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకే భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తేనే ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
సమ సమాజ మార్గదర్శి అంబేడ్కర్
సమ సమాజ మార్గదర్శి అంబేడ్కర్ అనిని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. మంగళవారం మహతి కళాక్షేత్రంలో అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రణాళికతో దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన నేత అంబేడ్కర్ అని కొనియాడారు. జర్నలిస్టు ఎం.సతీష్‌చందర్ మాట్లాడుతూ దేశ భవిషత్తును మలిచిన మహానుభావుడు అంబేడ్కర్ అని వెల్లడించారు. అనంతరం 60 మంది ఉద్యోగులకు అంబేడ్కర్ కమ్యూనల్ అవార్డులు ప్రదానం చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది ఖాసిం, డిప్యూటీ ఈఓ ఆనందరాజు, టీటీడీ సీపీఆర్‌ఓ డాక్టర్ రవి పాల్గొన్నారు.


