అలసత్వం వహిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

అలసత్వం వహిస్తే సహించం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

తిరుపతి క్రైమ్‌ : కోర్టు విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది అలసత్వం లేకుండా పనిచేయాలని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. మంగళవారం న్యూ డీపీఓ కార్యాలయంలో జిల్లావ్యాప్తంగా కోర్టు విధులు నిర్వర్తించే పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన కోర్టు కేసుల డిస్పోజల్‌, పెండింగ్‌ నాన్‌–బెయిలబుల్‌ వారెంట్స్‌, పీఆర్సీ కేసులు, అలాగే సీసీ, ఎస్సీ కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా కేసుల స్థితిని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ కోర్టు విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం కూడా సహించబోదని స్పష్టం చేశారు. ప్రతి కేసును సమయానికి కోర్టుకు హాజరు పరచడం, ఎన్‌బీడబ్ల్యూఎస్‌ను త్వరితగతిన అమలు చేయడం, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా కేసుల ఆలస్యానికి దారితీస్తుందని, దీంతో న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగవచ్చని హెచ్చరించారు. మౌంటెడ్‌ సిస్టమ్‌ను సమర్థవంతంగా ఉపయోగించి కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దష్టి సారించి, పోలీస్‌ స్టేషన్ల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా డిస్పోజల్‌ శాతాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. కోర్టు సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కోర్టు విధుల్లో పనిచేసే ప్రతి పోలీస్‌ సిబ్బంది చట్టపరమైన అవగాహన పెంపొందించుకుని, న్యాయవ్యవస్థతో సమన్వయంగా పనిచేయడం ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేయాలని కోరారు. బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేసే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదనపు ఎస్పీ వెంకటరావు , డీఎస్పీ రమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement