– సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు జయంద్ర డిమాండ్
చంద్రగిరి: దామినేడులోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జయచంద్ర డిమాండ్ చేశారు. తిరుచానూరు పంచాయతీ దామినేడులోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఆయన మంగళవారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. దామినేడులో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించి ప్లాట్లు వేసి, అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో దర్జాగా కబ్జా జరుగుతుంటే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఎక్కడపడితే అక్కడ వాగు పోరంబోకులు, ఇనాం భూములు, డీకేటీలు ఇలా అన్ని రకాల ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే చూస్తూ ఉండడం దారుణం అన్నారు. తక్షణమే కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్‌కు సీపీఎం తరఫున విజ్ఞప్తి చేసున్నట్లు తెలిపారు.


