సాక్షి టాస్క్‌ఫోర్స్: దామినేడు ప్రభుత్వ భూములను భూకబ్జాదారుల నుండి కాపాడాలని సీపీఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్ డిమాండ్. మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో దామినేడులో వంక పొరంపోగు భూమి ఆక్రమణకు గురవుతూ పక్కా భవనాలు నిర్మిస్తున్న భూమిని పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయం ఆనుకొని ఉన్న దామినేడు గ్రామ లెక్క దాఖల సర్వేనెంబర్ 185/1లోని 2.56 ఎకరాలు వంక పోరంబోకు భూమిలో భూ కబ్జాదారులు విచ్చలవిడిగా భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు, భూ కబ్జాదారులకు అమ్ముడుపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలిపారన్నారు. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పేదలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి, తిరుపతి రూరల్ ప్రాంతాలలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయన్నారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు వాటిని గుర్తించి పేదలకు పంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తక్షణమే జోక్యం చేసుకొని దామినేడులో జరుగుతున్న భూకబ్జాలపై విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడి పేదలకు పంచాలని కోరారు.
నారా లోకేష్‌కు ఫిర్యాదు చేస్తాం
దామినేడులో అధికార పార్టీ నేతలు, అధికారులు కలసి చేస్తున్న భూ కబ్జాలపై మంగళవారం తిరుపతి నగరానికి వస్తున్న మంత్రి నారా లోకేష్‌ను సీపీఐ నాయకత్వంలో కలవనున్నట్లు తెలిపారు. దామినేడులో జరుగుతున్న భా కబ్జాలపై ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నదియా, నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మునీశ్వర్, రాము, విజయ తదితరులు పాల్గొన్నారు.


