అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓటేరు గ్రామ పంచాయతీ వద్ద దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటేరు చెరువుకు పడమర వైపున ఉన్న ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం బయటపడింది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ వారం నుంచి పది రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటకు కనిపించే స్థితిలో ఉండడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. స్థానిక వీఆర్‌ఓ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతి వెనుక అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తుండడంతో అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు ముందుగా మృతురాలు ఎవ్వరు అన్న విషయం తెలుసుకునే పనిలో పడ్డారు. ఎక్కడైనా మహిళ అదృశ్యమైనట్టు సమాచారం ఉంటే వారి వివరాలతో తిరుపతి రూరల్‌ పోలీసులను సంప్రదించాలని సీఐ మద్దయ్య ఆచారి కోరుతున్నారు.

ఆర్టీసీ బస్టాండు వద్ద

యువకుడి మృతి

నాగలాపురం: మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండు వెనుక ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బస్టాండ్‌ వెనుక చెత్తాచెదారం మధ్య ఓ యువకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి యువకుడు స్థానిక బీసీ కాలనీకి చెందిన విజయ్‌(30)గా గుర్తించారు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారని, విజయ్‌ గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై చనిపోయినట్లు విచారణలో తెలిపారు. అతని బంధువుల వద్ద నుండి ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మృతదేహాన్ని యువకుడి బంధువులైన ముత్తుకు అప్పగించారు.

స్ఫూర్తిప్రదాతకు ఘన నివాళి

తిరుపతి కల్చరల్‌: సమాన హక్కులు, బడుగు బలహీనవర్గాలకు అవకాశాలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా ఆయన జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, కూటమి నేతలు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ భరత్‌కుమార్‌తో కలిసి ఆర్టీసీ బస్టాండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కువ శాతం ఎస్సీ గ్రామాలు ఉన్నాయని, అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణానికి తిరుపతిలో 1.15 ఎకరాలను మంగళంలో స్థలం గుర్తించామన్నారు. త్వరలో అంబేడ్కర్‌ భవన్‌ నిర్మించడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తామని తెలిపారు. మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement