ప్రయత్నిస్తే విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రయత్నిస్తే విజయం తథ్యం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

పరీక్ష తప్పిన విద్యార్థి మళ్లీ ప్రయత్నిస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంది. ఒకసారి దెబ్బతింటే చేసిన తప్పును సరిద్దిదుకుని మరింత ఉత్సాహంతో ముందుకెళ్లే శక్తి విద్యార్థులలో ఉంటుంది. వారిని తల్లిదండ్రులు ధైర్యం చెప్పి ప్రోత్సహించాలి. నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తే సూటిపోటి మాటలు ప్రమాదకరం. దేశంలో 50 శాతం మంది అధికారులు పలు పరీక్షలలో తప్పి మళ్లీ పుంజుకుని నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

– ప్రమీలమ్మ, విశ్రాంత అధ్యాపకురాలు, తిరుపతి

సానుకూల దృక్పథంతో స్వీకరించాలి

విద్యార్థులు పరీక్షల ఫలితాల్లో తప్పితే ఏదో కోల్పోయినట్లు భావించడం దారుణం. మార్కులు అనేవి కేవలం విద్యార్థి రాసిన సమాధానాలను మూల్యాంకనం చేసినవి మాత్ర మే. ఇవి విద్యార్థుల జీవితాలకు కొలమానం కాదు. అలాగే భవిష్యత్తును నిర్ణయించే గీటురాయి కాదు. వీటిని విద్యార్థులు, తల్లదండ్రులు సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. మరో ప్రయత్నం కోసం మరింత కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలి. ఇతరుల మార్కులతో తమ పిల్లల మార్కులను పోల్చడం హేయమైన చర్య. ఇది పిల్లల ప్రాణాలకే ప్రమాదం. – ఎ.గోపాలకృష్ణ,

ప్రధానోపాధ్యాయుడు, తిరుపతి జిల్లా

ఎంతో మంది దిశానిర్దేశం చేస్తున్నారు

విద్యార్థి దశలో పలు పరీక్షలలో తప్పిన ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఇంజినీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారు. దేశ రాజకీయాలలో సైతం ఉన్నత పదవులలో ఉన్నవారు. పరీక్ష తప్పితే ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని గమనించి ఆ తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడితే విజయం తథ్యం. అంతేకానీ పరీక్ష తప్పితే జీవితం అంతం చేసుకోవడం, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చడం పిరికిపందల చర్య. విఫలమైతే మరింత కృషి చేసి విజయాన్ని బంధువులకు, సమాజానికి చూపించే ప్రయత్నం చేయాలి. అది విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్షణం.

– కేఆర్‌ శేఖర్‌రెడ్డి, అధ్యాపకులు, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement