రేణిగుంట: తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖగుప్తాకు విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బీడీ బాలాజీ తదితర నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఆమె తిరుమలకు వెళ్లారు.
గంజాయి రవాణా బట్టబయలు
తిరుపతి క్రైం: తిరుపతి నగరంలో గంజాయిమ రవాణాపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురం సర్కిల్ వద్ద జరిగిన ఈ ఘటనకు కేసు నమోదు చేశారు. తిరుపతి అర్బన్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వి.సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పడాల రోహిత్ జగ్గిరెడ్డి (24), ఆర్.ఆదిత్య కుమార్ అమ్మన్ (21), బి.విల్వన్ (23)లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రోహిత్, ఆదిత్యతో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 10 కిలోల గంజాయి కొనుగోలు చేసి ట్రైన్‌లో తిరుపతికి తీసుకొచ్చారు. అందులో 6 కిలోలను ఇప్పటికే విక్రయించి, మిగిలిన 4 కిలోలను అమ్మేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముద్దాయిల వద్ద నుంచి రూ.80,000 విలువ చేసే 4 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.


