తిరుపతి కల్చరల్: ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కూతుళ్ల పేరుపై కొనుగోలు చేసిన పక్కా రిజిస్ట్రేషన్ భూమిని కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యంగా కబ్జా చేశారని, కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. వారు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో పుదిపట్లకు చెందిన బాధితుడు ఏసీ.వెంకటప్ప తమ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖలాలోని 41 అంకణాల స్థలాన్ని గత ఏడాది మార్చి 17వ తేదీన రూ.57 లక్షలు వెచ్చించి తన కుమార్తెలు రేణుక, తనూజ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. సదరు భూమి కొనుగోలు చేసినప్పటి నుంచి పెరుమాళ్లపల్లి పంచాయతీకి చెందిన కత్తి సుధాకర్ తమ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో దళితులమైన తమ కులం పేరును ప్రస్తావిస్తూ దూషణలకు పాల్పడేవాడని తెలిపారు. దీనిపై గత మార్చి ఒకటో తేదీన తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగక, కబ్జాదారులకు వత్తాసు పలకడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దీంతో గత మార్చి 9న కోర్టు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసిందన్నారు. అయినా ఆక్రమణలు ఆగలేదని, ఈ అన్యాయంపై జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. రమణమ్మ, రాజేశ్వరి, పొన్నయ్య పాల్గొన్నారు.


