పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు గ్రామంలో తాగునీటి వాటర్‌ప్లాంట్‌కు వేసిన తాళం తీయకపోవడంతో గత మూడు రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న తాగునీటి వాటర్‌ప్లాంట్‌కు ఈనెల 12న తాళాలు వేసుకొని ఇంటికి వెళుతున్న నిర్వాహకుడు కాటూరు లక్ష్మయ్యపై అదే గ్రామానికి చెందిన దువ్వూరు రాకేష్‌రెడ్డి, చింతంరెడ్డి కృష్ణారెడ్డి, మరో ఇద్దరు దాడి చేశారు. వాటర్‌ప్లాంట్ తాళాలను దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారు. దీంతో మూడు రోజులుగా వాటర్‌ప్లాంట్ తాళాలు తీయకపోవడంతో గ్రామంలో తాగునీటికి స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ ప్రత్యేకాధికారి, స్థానిక తహశీల్దార్ హరికృష్ణను వివరణ కోరగా వాటర్‌ప్లాంట్ తాళాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలో ఓ వ్యక్తిని ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున వాటర్ ప్లాంట్ నుంచి మంచినీరు గ్రామస్తులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.


