చదువు దాసోహం | - | Sakshi
Sakshi News home page

చదువు దాసోహం

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల బరితెగింపు ● పది ఫలితాలు రాకనే జూనియర్‌ ఇంటర్‌ తరగతులు ప్రారంభం ● ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి ● చోద్యం చూస్తున్న అధికారులు

కార్పొరేట్‌లకు

కార్పొరేట్‌ క్లాసులు షురూ!

తిరుపతి సిటీ: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ముగిసి కనీసం పది రోజులు గడవలేదు.. ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చేందుకు మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు దాదాపు పూర్తి చేశారు. ఇంటర్‌తోపాటు జేఈఈ, నీట్‌ కోచింగ్‌ల పేరుతో తమదైన శైలిలో తల్లిదండ్రులకు వల వేసి, రూ.లక్షల్లో ఫీజులు సైతం కట్టించుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో పది ఫలితాలు రాకముందే తరగతులు ప్రారంభించారు.

ఒత్తిడి నుంచి కోలుకోక ముందే తరగతులా!

పది పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం పది రోజుల విరామం కూడా లేకుండా మళ్లీ ఇంటర్‌ తరగతులకు హాజరు కావాలంటే ఎలా? అని విద్యార్థులు మనోవేదన చెందుతున్నారు. కనీసం పరీక్షల ఒత్తిడి నుంచి కోలుక ముందే ఇంత దారుణంగా మళ్లీ తరగతులకు హాజరుకావాలని, తమ ప్రాణాలు తీస్తున్నారని విద్యార్థులు బహిరంగంగా కార్పొరేట్‌ సంస్థలపై విరుచుకుపడుతున్నారు. కానీ తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి, ఇంటర్‌ సిలబస్‌ను బ్రిడ్జ్‌ కోర్సు రూపంలో అందిస్తున్నామని, విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని కార్పొరేట్‌ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేస్తున్నాయి. విద్యార్థులు తల్లిదండ్రుల ఒత్తిడితో ఏమీ చేయలేని పరిస్థితిలో తరగతులకు హాజరువుతున్నారు.

భావిభారతం తరగతి గదుల్లో నిర్మితమవుతుందని ఎందరో మహానుభావులు వెల్లడించారు. అలా దేశవ్యవస్థను మార్చే విద్యారంగం నేడు ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యక్తుల చేతిలోకి వెళ్లింది. చదువులతల్లి సరస్వతి కొందరికి లక్ష్మీదేవిగా మారింది. ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పది పరీక్షల ఫలితాలు రాకనే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు చేసుకుని, బ్రిడ్జ్‌ కోర్సు పేరున తరగతులు ప్రారంభించేశాయి. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తమ జేబులు నింపుకుని చోద్యం చూస్తూ విధి నిర్వహణ మరిచిపోయింది. ఫలితంగా విద్యారంగం దోపిడీగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement