తిరుపతి అర్బన్: మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి సోమవారం మధ్యాహ్నం కలెక్టర్‌తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, అటవీశాఖాధికారి సాయిబాబతో కలసి తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 800 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్‌ను ఏర్పాటు చేసి, ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మన ప్రాంతానికి వచ్చే బోట్లకు అడ్డుకట్టవేయడంతోపాటు వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు 24 గంటల గస్తీ విధానం అమలు చేస్తామన్నారు. మైరెన్ పోలీసులతో సమన్వయం చేసుకుని లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, బైనాక్యులర్స్ వంటి అవసరమైన సామగ్రి అందజేస్తామని చెప్పారు. మైరెన్ పోలీసులకు సుమారు రూ.25 లక్షల నిధులు మంజూరు చేసి, అవసరమైన పరికరాలు కొనుగోలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జువ్వలదిన్నె ప్రాంతంలో చిన్న జెట్టీ ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, త్వరితగతిన చర్యలు చేపడతామని తెలిపారు.
భద్రత బలోపేతానికి కమిటీలు
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్స్యకారుల భద్రత మరింత బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులను తీసుకుని, మత్స్యకారులు, ఫిషరీస్ శాఖ, మైరెన్ పోలీస్‌తో సమన్వయ వ్యవస్థగా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే స్పందించేలా ఈ కమిటీలు పనిచేస్తాయని చెప్పారు. అవసరమైతే సాగర మిత్రలు లేదా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కూడా వినియోగిస్తామన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వహించడంతో సమయం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో, సమీప ప్రాంతంలో కొత్త జెట్టీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డి, మత్స్యశాఖ అధికారి రాజేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


