కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 380 అర్జీలు
రెవెన్యూ సమస్యలపై 226 అర్జీలు
తిరుపతి అర్బన్: చిన్న చిన్న సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇవ్వడంలో తప్పులేదని, అయితే క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపడం ద్వారా కలెక్టరేట్‌కు రావాల్సిన పనిలేకుండా ఉంటుందన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 380 అర్జీలు వచ్చాయి. అందులో 226 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఇచ్చారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, రోజ్‌మాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి తదితరులు అర్జీలను స్వీకరించారు. కాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీజీఆర్‌ఎస్‌కు తాగునీరు వసతులు కల్పించడంతోపాటు అర్జీదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇవ్వడానికి వచ్చిన తిరుపతి శెట్టిపల్లికు చెందిన పీడీ మునిరాజా అనే వ్యక్తి ఎండ తీవ్రత నేపథ్యంలో ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ పోలీసులు సమీపంలో ఉన్న మెడికల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి వైద్యం చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలు మధ్యాహ్నం వరకు మాత్రమే కళాశాల నిర్వహించాల్సి ఉన్న సాయంత్రం వరకు చేపడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టరేట్‌లో అధికారులకు సోమవారం అర్జీ అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ కళాశాలలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్చర్ డిమాండ్ చేశారు.ఆ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.
న్యాయం చేయండి సార్!
మా ఇంటిని తొలగిస్తున్నారని పుత్తూరు మండలం మెట్టగానిసత్రం గ్రామానికి చెందిన ఏ.భారతి ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్వర మంగళం లెక్కదాఖలలోని 126–1లో 2.5 సెంట్ల స్థలంలో చిన్న ఇంట్లో 45 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, తన భర్త రాజు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చూపించుకుంటూ మూడు నెలలుగా తిరుపతిలో ఉంటున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక రెవెన్యూ ఉద్యోగి తాము స్థానికంగా లేమంటూ తహసీల్దార్‌కు చెప్పడంతో ఆ ఇంటిని తొలగిస్తున్నారని చెప్పారు. ఇంటిని కూల్చి వేస్తే నివాసం ఉండడానికి ఏ ఆధారం లేదని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆమేరకు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు.
ట్రైసైకిల్ ఇప్పించండి
తనకు 90 శాతం వికలత్వం ఉండడంతో రెండు కాళ్లు పనిచేయడం లేదని, తనకు ట్రై సైకిల్‌ను ఇప్పించాలని రామచంద్రాపురం నడవలూరు గ్రామానికి చెందిన ఎం. వేణుగోపాల్ కోరారు. పేద కుటుంబానికి చెందిన తాను ట్రై సైకిల్ కొనుగోలు చేయడానికి ఆర్థికశక్తి లేదన్నారు. విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి
తిరుపతి నగరం ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆర్‌బీఎస్ రాము కలెక్టర్ వెంకటేశ్వర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. మంగళంలో నివాసం ఉంటున్న తాను కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళితే అన్నీ పరీక్షలు చేసి, పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని చెప్పారన్నారు. ఈ క్రమంలో సక్రమంగా ఆపరేషన్ చేయకపోవడంతో మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే చైన్నెలోని ఓ ఆస్పత్రికి పంపించారని చెప్పారు. అయితే చైన్నెలో ఆస్పత్రి వారు తిరుపతిలో ఆపరేషన్ సక్రమంగా చేయలేదని స్పష్టం చేశారని వెల్లడించారు. ఆపరేషన్ నిమిత్తం రూ.లక్షలు తన వద్ద నుంచి లాక్కున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆర్‌బీఎస్ రాముతోపాటు తమ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
పీజీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి
ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ చేయండి
తాము తిరుపతి కొర్లగుంటలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో చదువుకుంటున్నామని, రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు రాకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నర్సింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ సందర్భంగా అర్జీలు అందజేశారు.


