తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ఐఐ ఎమ్ సంస్థలో తిరుపతి కౌటిల్య ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జి గీతిశ్రేయ ఎంబీఏ కోర్సులో సీటు సాధించింది. ఆమె తల్లి రజిని గృహిణిగా తండ్రి చెంచుబాబు నాయుడుపేట డీఎస్పీగా విధు లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కౌటిల్య సంస్థ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ క్యాట్‌లో గీతిశ్రేయ 99.62 శాతం మార్కులు సాధించి అత్యుత్తమ స్కోర్‌తో ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్ ఐఐఎమ్ సంస్థలో సీటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. తమ సంస్థలో గత 15ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులు పలు ఉన్నత సంస్థల కళాశాలల్లో సీట్లు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి గీతిశ్రేయ మాట్లాడుతూ ఐఐఎమ్ అహ్మాదాబాద్‌లో సీటు సాధించడం గర్వంగా ఉందని, కౌటిల్య సంస్థ డైరెక్టర్, ఫ్యాకల్టీ సలహాలు, సూచనలు, శిక్షణ ఎంతో ఉపయోగపడిందని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నిధులు రికవరీ చేయాలని ధర్నా
కేవీబీపురం: వగత్తూరు పంచాయతీలోని డ్వాక్రా సంఘాల నిధులు రూ.40 లక్షలు స్వాహా చేసిన వెలుగు సిబ్బందిని విచారణ జరిపి, రికవరీ చేసి, బాధ్యులను విధుల నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి జనార్దన్, ప్రాంతీయ కార్యదర్శి నాగలాపురం నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం కేవీబీపురం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద వగత్తూరు పరిధిలోని డ్వాక్రా మహిళలతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా దాసరి జనార్దన్, నాగరాజు మాట్లాడుతూ 2023 సంవత్సరం నుంచి 10 ఎస్‌హెచ్‌జీలు బ్యాంకు లింకేజీ రుణాలు, పొదుపు, అంతర్గత అప్పులను ప్రతినెల సభ్యులు వసూలు చేసి బ్యాంకులకు చెల్లించే క్రమంలో సంఘమిత్ర జోక్యం చేసుకుని బ్యాంకులో సిబ్బందిని తప్పుదోవ పట్టించి, తన ఖాతాకు వేసుకోవడం, తన బంధువుల ఖాతాకు, వేసుకోవడం, బ్యాంకు కరస్పాండెంట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేతివాటంతో సంఘమిత్ర మునెమ్మ రూ. 40 లక్షలకు పైగా స్వాహా చేసిందని, సీసీ చంద్రకళ రూ. 3.70 లక్షలు, బదిలీ అయిన సీసీ వీరజిన్నా రూ. 6 లక్షల స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చినప్పటికీ, మూడు నెలలకు పైగా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు కూలీనాలి చేసి బ్యాంకు అప్పులు, పొదుపులు చెల్లిస్తున్న నిధులను అక్రమాలు చేసి సొంతానికి వాడుకోవడం దారుణమన్నారు. బ్యాంకు సిబ్బందిపై కూడా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ మాలతికి వినతి పత్రం అందజేశారు.


