భార్యపై భర్త దాడి | - | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త దాడి

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

సైదాపురం: చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి, భార్యపై భర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సైదాపురం మండలం ఆదూరుపల్లి గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. ఆదూరుపల్లి గిరిజన కాలనీకి చెందిన బండి సురేష్‌ ,భార్య పోలమ్మలు కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారు. ఈ క్రమంలో ఆదివారం వారి మధ్య వివాదం జరిగింది. వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అగ్రహించిన భర్త సురేష్‌ తాగిన మత్తులో అక్కడే ఉన్న కొడలితో భార్య పోలమ్మపై దాడి చేశాడు. దీంతో పోలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సోమవారం హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మహిళ ఆత్మహత్య

సూళ్లూరుపేట: పట్టణంలోని సీపీఎం కార్యాలయానికి పక్కనే నివాసం ఉంటున్న అల్లూరు సరళారెడ్డి (59) సోమవారం మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగా ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. సంఘటన జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ లేఖ రాసి ఉండగా దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దానిపై విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తీర్థంపాడులో అగ్నిప్రమాదం

డక్కిలి: మండలంలోని తీర్థంపాడులో గురువా రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమణయ్య చిల్లర దుకాణం, బలం రమణయ్య, వెంకటాద్రి, సుగుణమ్మలకు చెందిన ఐదు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంకటగిరి, రాపూరు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement