దయనీయం.. గ్రంథాలయం | - | Sakshi
Sakshi News home page

దయనీయం.. గ్రంథాలయం

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

● నిధులు ఇవ్వని సర్కార్‌ ● నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఇక్కట్లు ● ఈ నెల 28 నుంచి వేసవి శిక్షణా శిబిరాలు ● పన్నుల పెండింగ్‌తో తప్పని తలనొప్పులు ● రూ.36 కోట్లు బకాయిల గుదిబండ

తిరుపతి అర్బన్‌: గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్‌ నాలుగు నెలలుగా అందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన నిధులను సక్రమంగా విడదల చేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చింది. మరోవైపు నిధులు లేకపోవడంతో 10 నెలలుగా దినపత్రికలకు ఇవ్వాల్సిన బిల్లులు, కరెంట్‌ చార్జీలు, స్వీపర్‌ చార్జీలు చెల్లించలేక నానా తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక నెలకు గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనం, ఇతర ఖర్చులకు రూ.91 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. 71 గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. 34 మంది శాశ్వత ఉద్యోగులు, 15 మంది ఓట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, 121 మంది పెన్షనర్లు ఉన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ నుంచి 8 శాతం చొప్పున సెస్‌ మొత్తం రూ.36 కోట్లు పన్ను బకాయిలు రావాల్సి ఉంది. అందులో తిరుపతి నుంచే ప్రధానంగా రూ.24 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. గడ్డుకాలం నుంచి బయటపడడం ఎలా అంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

గ్రంథాలయాలకు గడ్డుకాలం

ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సెస్సు చెల్లించేవారు. దీంతో జీతాలతోపాటు పెన్షన్లు, మెయింటెనెన్స్‌ ఖర్చులు పెట్టుకోవడంతోపాటు కొత్త పుస్తకాల కొనుగోలు, పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలను అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం జీతాలు చెల్లించడమే భారంగా మారడంతో నిర్వహణ గడ్డుకాలంగా తయారైంది. రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌కు సంబంధించి రూ.2 కోట్ల మేరకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో వారంతా గ్రంథాలయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సర్కారు నిధులు విడుదల చేయలేదని నచ్చజెప్పి పంపుతున్నారు. ఈ క్రమంలో మే 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమబాట పట్టడానికి సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతోంది.

ఉమ్మడి జిల్లా సమాచారం

గ్రంథాలయాలు 71

మొత్తం పోస్టులు 118

రెగ్యులర్‌ 34 శాశ్వత ఉద్యోగులు

ఔట్‌సోర్సింగ్‌ 15 మంది ఉద్యోగులు

ఖాళీలు 69 ఉద్యోగాలు

బకాయిలు రూ. 36 కోట్లు

తిరుపతి రూ.24 కోట్లు

చిత్తూరు రూ.12 కోట్లు

28 నుంచి వేసవి శిక్షణా శిబిరాలు

మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ముందే ఆర్థిక కష్టాలతో గ్రంథాలయాల నిర్వాహణ ఆందోళన పుట్టిస్తుంటే... తాజాగా ప్రతి గ్రంథాలయంలో ఈ నెల 28 నుంచి జూన్‌ 6 వరకు వేసవి శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా వేసవి శిబిరాలు నిర్వహించడం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులకు ఆటపాటలు, పోటీలు, బహుమతులు, గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు తిప్పలు పడుతున్న నేపథ్యంలో వేసవి శిక్షణా తరగతులు మరింత భారంగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఖర్చులు ఉద్యోగులే పెట్టుకోవాలని చెప్పడంతో దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాది వేసవి శిబిరాలు సందర్భంగా పెట్టిన ఖర్చులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోగా మళ్లీ వేసవి శిబిరాలు నిర్వహించాలని చెప్పడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement