– ముగ్గురికి గాయాలు
దొరవారిసత్రం: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును వెనుకనే వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు గాయపడిన ఘటన మావిళ్లపాడు గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు... కోట నుంచి సూళ్లూరుపేటకు వెళ్లుతున్న కారును మావిళ్లపాడు గ్రామం వచ్చే సరికి నెల్లూరు నుంచి చైన్నె వెళ్లే లారీ వెనుకనే వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించే ముగ్గురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందునే కారును ఢీకొన్నట్లు స్థానికులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదాన్ని పరిశీలించి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్లెమల్లు నాగసాయి ప్రనూన్ కుమార్‌రెడ్డి(19) మృతిచెందాడు. పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓజిలి మండలం వాకాటి వారికండ్రిగ గ్రామానికి చెందిన నాగసాయి ప్రనూన్ కుమార్‌రెడ్డి మైనింగ్‌శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. శనివారం బైక్‌లో ఇంటి నుంచి నాయుడుపేటకు వస్తుండగా మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపక్కన గుంతలో పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రమాదంలో మృతిచెందిన నాగసాయి ప్రనూన్ కుమార్‌రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మే 10న
కురబ సంఘ సమావేశం
తిరుపతి కల్చరల్:దక్షిణ భారత కురుబ, కురు మ, కురుంబన్, గురువాహన్, దంగర్ తదితర పేర్లతో పిలువబడే జాతీయ సంఘం ఆధ్వర్యంలో మే 10వ తేదీన తిరుపతిలోని రామ తులసి కల్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కురుబ, కురుమ సౌతిండియా రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రాతినిధ్యం కురుబలకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగే సర్వసభ్య సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరు కానున్నారని తెలిపారు. రవిశంకర్‌రెడ్డి, రెడ్డి కుమార్ గౌడ్, రమణ, ఆనంద్, ఈశ్వరయ్య, ఇంద్రకుమార్, రామాంజనేయులు, కురుబ సంఘం యువ నేతలు శివ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్
సూళ్లూరుపేట రూరల్:మండలంలోని దామానెల్లూరు గ్రామంలో కోడి పందేల స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంబుబాబు, సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్టు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు. దామానెల్లూరు గ్రామంలోని పారెస్టు ప్రాంతంలో ఏడుగురు వ్య క్తులు కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు సమాచా రం అందిందన్నారు. వారిని అదుపులోకి తీసుకు ని, వారి వద్ద నుంచి 4 కోళ్లు, 4 కత్తులు, 5 మోటా రు సైకిళ్లు, రూ.10,200 నగదును స్వాధీనం చేసు కున్నట్టు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ఓజిలి: ఓజిలి క్రాస్ రోడ్డు పక్కన గ్యాస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు నుంచి కుప్పానికి పెప్సి లోడ్డుతో లారీ బయలుదేరింది. డ్రైవర్ లారీని రోడ్డు పక్కన చెట్టు కింద నిలుపుదల చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కురుగొండ నుంచి చిల్లకూరుకు వెళ్తున్న కారు అదుపుతప్పి లారీ ముందు భాగంలో ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కారును స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


