తిరుపతి క్రైం: తిరుపతి జిల్లాలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాల కోసం జరుగుతున్న వరుస హత్యల కేసులను జిల్లా పోలీసులు సంచలనాత్మకంగా ఛేదించారు. గత కొంతకాలంగా నమోదవుతున్న కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఛేదించామని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దర్యాప్తులో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 11, 2026న జరిగిన మహిళ హత్య కేసులో అరెస్టయిన పి.విశ్వనాథ్ అలియా ప్రశాంత్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణలో అతని అసలు పేరు ఎ.ఎం.అజీజ్ అలియాస్ అబ్దుల్ అజీజ్ అలియాస్ కర్ణాటక అజీజ్ (39) అని తేలింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకాకు చెందిన ఈ నిందితుడు 2018లో కేరళలో పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో అతని ఆచూకీ తెలిపిన వారికి కేరళ పోలీసులు రూ.2 లక్షల బహుమతి కూడా ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు.
నాలుగు కీలక కేసుల పరిష్కారం
నిందితుడి వాంగ్మూలంతో తిరుపతి జిల్లాలో జరిగిన నాలుగు సంచలన కేసులు ఛేదించబడ్డాయి. వీటిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు, తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రాబరీ, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య కేసు ఉన్నాయి.
మహిళ సహకారంతో నేరాలు
ఈ క్రమంలో వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె సహకారంతో ఆటో రిక్షా కొనుగోలు చేసి నేరాలకు ఉపయోగించినట్లు తెలిసింది. ఈ కేసులో రాజమ్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.21.5 లక్షల ఆభరణాలు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.21.5 లక్షల విలువైన 127.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 48 గ్రాముల వెండి ఆభరణాలు, అలాగే నేరాలకు ఉపయోగించిన ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు రాష్ట్రాల్లో 21 కేసులు
ఈ నిందితుడిపై కర్ణాటకలో 4, కేరళలో 6, తిరుపతి జిల్లాలో 11 కేసులు నమోదై మొత్తం 21 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తిరుపతికి చేరుకున్న తర్వాత తన అసలు గుర్తింపును దాచిపెట్టి పి.విశ్వనాథ్ పేరుతో ఆధార్ కార్డు ఉపయోగిస్తూ హోటళ్లలో పనిచేస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకున్నాడు.
దర్యాప్తు బృందానికి ఎస్పీ ప్రశంసలు
ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎ.శ్రీనివాసులు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు. వారికి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.


